
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో కీలక ముందడుగు పడింది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేపట్టి న్యాయస్థానంలో ప్రాథమిక ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ మరణానికి పోలీసుల దాడులే కారణమని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో అప్పటి సీఐ నాగరాజుతో సహా ఏడుగురు పోలీసులను నిందితులుగా చేర్చింది.
120 మంది సాక్షుల విచారణ.. 263 పత్రాలతో ఛార్జిషీట్
దర్యాప్తులో భాగంగా సుమారు 120 మంది సాక్షులను విచారించిన అధికారులు.. కీలక ఆధారాలుగా భావించిన 263 పత్రాలను 86 పేజీల ఛార్జిషీట్‌కు జతచేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా సాయికృష్ణను విజయవాడకు తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణపై అమానుషంగా దాడి చేసినట్లు సిట్ ఆరోపించింది. ఈ దాడుల కారణంగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి మరణించినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, అర్ధరాత్రి సమయంలో శ్మశానవాటికకు తరలించి దహనం చేసినట్లు దర్యాప్తు నివేదికలో వివరించింది.
సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నాలు?
సాయికృష్ణ మరణానికి సంబంధించిన వాస్తవాలు బయటపడకుండా సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు సిట్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. పోలీస్ స్టేషన్లో నిర్వహించాల్సిన లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లలో సాయికృష్ణకు సంబంధించిన వివరాలు నమోదు చేయలేదని తెలిపింది.
అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని తొలగించడం, పోలీస్ స్టేషన్‌కు రంగులు వేయించడం, లాకప్‌ను నీటితో శుభ్రం చేయడం వంటి చర్యలు సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాల్లో భాగమని దర్యాప్తు బృందం అనుమానించినట్లు నివేదికలో ప్రస్తావించింది.
కొనసాగుతున్న లోతైన దర్యాప్తు
ఈ కేసులో సాయికృష్ణ మరణానికి ఏడుగురు పోలీసులే ప్రత్యక్షంగా బాధ్యులని సిట్ తన ప్రాథమిక ఛార్జిషీట్లో పేర్కొంది. కేసుకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని న్యాయస్థానానికి తెలియజేసింది. తదుపరి విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు ఈ కేసులో మరింత కీలకం కానున్నాయి.
కస్టడీలో జరిగిన మరణం, అనంతరం సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఈ కేసును మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. న్యాయస్థానంలో తదుపరి జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది.
also read: ప్రముఖ చారిత్రక నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ కన్నుమూత.. తెలుగు సాహిత్యానికి తీరని లోటు!