
SHOCKING: విజయవాడ నగరంలో మనసును కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.10 కోసం ఓ వృద్ధుడి ప్రాణాలు పోవడం నగర ప్రజలను షాక్‌కు గురిచేసింది. చిట్టినగర్ ప్రాంతంలో తాతాజీ అనే వృద్ధుడిని ఓ బాలుడు కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. మద్యం తాగేందుకు డబ్బులు అడిగిన బాలుడికి ఇవ్వలేదన్న కారణంతో ఈ దారుణం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాలుడు అప్పటికే మద్యం మత్తులో ఉన్నాడు. మద్యం కొనుగోలు చేసేందుకు తాతాజీని రూ.10 అడిగాడు. వృద్ధుడు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన బాలుడు తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడిన తాతాజీ రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు నిర్ధారించారు.
మృతుడు తాతాజీ తాపీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆయన స్వస్థలం మంగళగిరి నుకలపేట కాగా, ఉపాధి నిమిత్తం విజయవాడలో నివసిస్తున్నారని తెలిపారు. రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వృద్ధుడి మృతి స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. కేవలం రూ.10 కోసమే ఓ వ్యక్తి ప్రాణం పోవడం సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ధోరణికి అద్దం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హత్య చేసిన అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ నగరంలో భయాందోళనలకు కారణమైంది. రాత్రి వేళల్లో మద్యం మత్తులో ఉన్న యువకుల వల్ల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ALSO READ: Politics: ఆ విషయాల్లో జోక్యం.. TPCC చీఫ్ మహేశ్‌గౌడ్‌పై విమర్శలు





