New Airlines In India: దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకు షెడ్యూల్డ్ విమానాలు నడపడానికి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేసింది. తాజాగా కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకూ కేంద్ర పౌర విమానయానశాఖ ఎన్ఓసీ జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
6 నెలల్లో విమాన సర్వీసులు ప్రారంభం
వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ నాలుగు సంస్థలు తమ సర్వీసులను ప్రారంభించే అవకాశముందని మంత్రి వెల్లడించారు.’భారత విమానయాన రంగం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఉడాన్ పథకం ద్వారా స్టార్ ఎయిర్, ఇండియా వన్ ఎయిర్, ఫ్లై91 వంటి చిన్న విమానయాన సంస్థలు దేశంలో విమాన సర్వీసులు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ రంగంలో మరెంతో అభివృద్ధికి అవకాశాలున్నాయి’ అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
విశాఖ నుంచి ట్రూజెట్సర్వీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం భోగాపురంలో కొత్త విమానాశ్రయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. అక్కడి నుంచి పనిచేయాలని ట్రూజెట్‌కు సూచించినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగించినా.. తదుపరి సర్వీసులు నిలిచిపోయాయి. మళ్లీ విశాఖ కేంద్రంగా ప్రారంభం కానుంది.





