
మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల వాడకం ఈ తరం జీవితంలో భాగంగా మారిపోయింది. అయితే మితిమీరిన స్క్రీన్ టైమ్ పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధికంగా మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగించడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతున్నట్లు తాజా వైద్య అనుభవాలు చెబుతున్నాయి. ఈ అంశంపై జైపూర్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రత గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ నమ్రత గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఆమె వద్దకు వచ్చిన 29 ఏళ్ల యువకుడు ఈ సమస్యకు స్పష్టమైన ఉదాహరణగా నిలిచాడు. శారీరకంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతనిలో స్పెర్మ్ కౌంట్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. విచారణలో అతడి జీవనశైలే దీనికి ప్రధాన కారణమని వైద్యులు గుర్తించారు. ఆ యువకుడు రోజంతా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం, రాత్రి అర్థరాత్రి రెండు గంటల వరకు మొబైల్ ఫోన్ చూస్తూ గడపడం అలవాటుగా మారింది.
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు పనిచేయడం వల్ల శరీరానికి సమీపంగా ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా, రేడియేషన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వివరించారు. ముఖ్యంగా పురుషుల సంతానోత్పత్తి వ్యవస్థపై ఇది ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని చెప్పారు. స్పెర్మ్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత మారిపోవడంతో స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్ రెండూ తగ్గిపోతాయని వెల్లడించారు.
ఇక రాత్రివేళల్లో ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుందని, ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెలటోనిన్, టెస్టోస్టెరాన్ వంటి కీలక హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో సంతానోత్పత్తి ఆరోగ్యం బలహీనపడుతుందని డాక్టర్ నమ్రత గుప్తా హెచ్చరించారు. దీర్ఘకాలంగా ఇదే అలవాటు కొనసాగితే భవిష్యత్తులో సంతానలేమి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా డిజిటల్ పరికరాలపై ఆధారపడటం అనివార్యంగా మారిందని, కానీ అవసరానికి మించిన వినియోగమే సమస్యలకు దారి తీస్తోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా వంటి కారణాలతో గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గిపోతోందని పేర్కొన్నారు.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పని చేయకుండా టేబుల్‌పై ఉంచి ఉపయోగించాలి. మొబైల్ ఫోన్‌ను అవసరమైనంత వరకే వాడాలి. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవడం చాలా అవసరమని సూచిస్తున్నారు. రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం ద్వారా హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
అలాగే వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు కూడా సంతానోత్పత్తి ఆరోగ్యానికి కీలకమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఈ సమస్యలు ఎదురవడం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తుందని, ఇప్పటికైనా యువత అప్రమత్తంగా మారాలని డాక్టర్ నమ్రత గుప్తా సూచించారు.
ALSO READ: ‘కుర్చీ తాత’ చనిపోయాడని ప్రచారం.. క్లారిటీ (VIDEO)





