హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువలా వస్తున్నాయి. నేరుగా కమిషనర్ చేతికే వినతిపత్రాలు ఇస్తున్నారు. ఫిర్యాదులపై చర్యలకు 3 వారాల గడువు ఇస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ప్రతి సోమవారం నిర్వహించ తలపెట్టిన ప్రజావాణిలో భాగంగా సోమవారం మొదటి రోజు మొత్తం మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.40 గంటల వరకూ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు హైడ్రా కమిషనర్ ఏవీరంగనాథ్.
హైడ్రా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులకు టోకెన్లు అందజేసి.. విజిటింగ్ రూంలో కూర్చోబెట్టి వరుస క్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. సమస్య ఏమిటి..? ఏ ప్రాంతానిది..? పూర్తి వివరాలు తెలుసుకుని అప్పటికప్పుడే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యను వివరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు రంగనాథ్.ఔటర్ రింగ్గురోడ్డు పరిధి దాటి ఇతర జిల్లాల నుంచి కూడా ఫిర్యాదుదారులు వచ్చారు. అయితే తమ పరిధిలో లేదని నచ్చజెప్పి వెనక్కి పంపించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
హైడ్రా పరిధిలోని ఫిర్యాదులే కాకుండా.. ఇతర శాఖలకుచెందిన సమస్యలపై కూడా ఫిర్యాదులు వచ్చాయి.వాటిని ఆయా శాఖాధిపతులకు అందజేయాలని కమిషనర్ సూచనలు చేశారు. ప్రతి ఫిర్యాదుపై హైడ్రా కార్యాలయంలో అధికారులతో చర్చించి.. ఆయా ఫిర్యాదులు ఎవరి పరిధిలో ఉంటే వారికి అందజేసి.. వారం రోజుల్లో పూర్తి నివేదిక కావాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కేటాయించి వారితో ఫాలోఆప్ చేయాలంటూ ఫిర్యాదుదారులకు సూచనలు చేశారు. 3 వారాల్లో మీ ఫిర్యాదుపై స్పందన ఉంటుందని కమషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు.నేరుగా హైడ్రా అధికారులు ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని రంగనాథ్ నుంచి హామీ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫిర్యాదుదారులు.
సామాన్యుల నుంచి ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులు, ఆర్మీ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఇలా అన్ని వర్గాల నుంచి హైడ్రా కమిషనర్ కు నేరుగా ఫిర్యాదులు వచ్చాయి.చెరువులు, పార్కులు, రహదారుల కబ్జాపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కొంతమంది స్థానికులు కాజేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఆధారిత పత్రాలతో ఫిర్యాదు చేశారు ప్రజలు.పాత లే ఔట్లను పక్కన పెట్టి.. ఫోర్జరీ లే ఔట్లతో పార్కులను, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేసిన కబ్జాదారులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
తనకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలంతో పాటు.. పార్కు స్థలాన్ని కూడా స్థానికంగా ఉన్న ఓ మహిళ కాజేసిందని.. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని.. 1971లో ఇండో పాక్ వార్‌లో నేరుగా పాల్గొన్న విశ్రాంత సైనికుడు పి. సీతారామరాజు ఫిర్యాదు చేశారు. జవహార్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని నోటరీ చేసి అమ్మేస్తున్నారని.. మొత్తం 6 వేల ఎకరాలకు గాను 2500 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని.. దీనిని కూడా ప్లాట్లు చేసి అక్రమ లే ఔట్‌తో అమ్మేస్తున్నారని.. తాజాగా 15 ఎకరాల స్థలాన్ని స్థానికంగా ఉన్న వ్యక్తి కాజేయాలని ప్రయత్నిస్తున్నారని ముఖేష్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఇరిగేషన్ నాలాకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 60 గజాల ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని.. వరద నీరు వచ్చి చేరే లోతట్టు ప్రాంతంలో పేదవారు ఇల్లు కొనుక్కొని మోసపోతున్నారని.. వెంటనే ఆపాలంటూ ఉప్పల్ నియోజకవర్గం చిలకానగర్ కార్పొరేటర్ భర్త ప్రవీణ్ ముదిరాజ్ హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని బక్షికుంట, రేగుల కుంటలను సుందరీకరిస్తే ఆయా చెరువుల్లోకి మురుగు నీటిని వదిలేస్తున్నారని చందానగర్‌కు చెందిన ప్రజా సంఘాల నాయకులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎస్‌టీపీ(సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ద్వరా మురుగును శుభ్రం చేయకుండానేరుగా చెరువులోకి వదిలేయడంతో రూ. కోట్లు ఖర్చు చేసి కాపాడిన చెరువు మళ్లీ దుర్గంధంగా మారుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వరద కాలువలు కూడా కబ్జా అవుతున్నయంటూ చందానగర్ వాసులు ఫిర్యాదు చేశారు.