
-
ఈవీఎంల విశ్వసనీయతపై సమరభేరి
-
రాజీనామాలకు బిఆర్ఎస్ పట్టుబట్టే ఛాన్స్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈవీఎంలపై జరుగుతోంది కాంగ్రెస్ పోరాటం. అయితే తెలంగాణ గడ్డపై ఈవీఎంల విశ్వసనీయతకు, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా భారీ ఓటు చోరీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇది ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీకి ఊహించని ఒక రాజకీయ వరంగా మారబోతోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని ఏడాదిన్నర దాటిన తర్వాత.. స్వయంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే దేశంలో ఓట్ల చౌర్యం జరుగుతుంది అంటూ రోడ్డు ఎక్కడం.. గులాబీ పార్టీకి పదునైన ఆయుధాన్ని అందించినట్లు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయంపై.. ఆది నుంచి గులాబీ పార్టీ శ్రేణుల్లో లోతైన అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ రాగాన్ని అందుకోవడంతో.. అది తమ పరాజయం ప్రజా తీర్పు కాదు అని… అది కూడా వ్యవస్థాగత లోపమేనని వాదించేందుకు కేసిఆర్ శిబిరం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం ద్వారా ఏదో సాధించవచ్చు కానీ.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి పొలిటికల్ డామేజ్ కావడం ఖాయం.
రాజకీయ ఎదురుదాడి…
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ విధానం గులాబీ పార్టీకి ఒక అస్త్రంగా మారుతోంది. తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి సిద్ధమవుతోంది ఆ పార్టీ. దేశంలో ఈవీఎంల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి అన్నది కాంగ్రెస్ వాదన అయితే.. ముందుగా తెలంగాణలో ఆ పార్టీ సాధించిన 64 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ సీట్ల చట్టబద్ధతను ఎలా సమర్ధించుకుంటారని గులాబీ పార్టీ శ్రేణులు నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో గెలిచినప్పుడు ఎన్నికల సంఘాన్ని, ఈవీఎంలను కీర్తించి.. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ సంబరాలు చేసుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎదురు దెబ్బలు తగలగానే వ్యవస్థలపై బురద చల్లడం.. పచ్చి అవకాశవాదమని గులాబీ పార్టీ ఎండగట్టనుంది. ఈ సభ నిర్వహణ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన గెలుపు పై తానే అనుమానం వ్యక్తం చేసింది. ఈ పాయింట్ తోనే గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక సులువైన మార్గం దొరికింది.
రేవంత్ తో సహా ఎమ్మెల్యేల రాజీనామాకు…
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అస్త్రంతో గులాబీ పార్టీ రెచ్చిపోయే అవకాశం కనిపిస్తోంది. రాజీనామాలకు డిమాండ్ చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలపై విశ్వాసం లేనప్పుడు.. అదే ప్రక్రియ ద్వారా సంక్రమించిన అధికారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని గులాబీ పార్టీ వాదిస్తోంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. ఓటు చోరీ పై అంతగా బాధపడుతుంటే.. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సామూహిక రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ వినిపించనుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయల మారడం ఖాయం.
ఇవి కూడ చదవండి:
- మందుబాబులకు బిగ్ షాక్…! తెలంగాణలో ధరలు పెంపు…
-
అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాఖాన్కు షాక్…! దేశం విడిచివెళ్లాలంటూ ఆదేశాలు జారీ…
-
సంతలో ఎవరైన అమ్మకాలు, కొనుగోలు చేయవచ్చు…! సర్పంచ్ రమాదేవి
-
“పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి”- సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..