
క్రైమ్ మిర్రర్ : రోడ్డు ప్రమాదం ఇద్దరు యువ క్రీడాకారుల జీవితాలను అర్ధాంతరంగా ముగించింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అథ్లెట్లు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. ఒడిశాలోని కటక్ హైవేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పలువురిని కలచివేసింది. మృతులను మృత్యం దొండపాటి, మలయ్ బారిక్గా గుర్తించారు.
అర్ధరాత్రి వేళ విషాదం
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మృత్యం దొండపాటి, మలయ్ బారిక్ ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. వారి వెనుక మరో బైక్‌పై ఇంకో క్రీడాకారుడు, స్విమ్మింగ్ కోచ్ వెళ్తున్నారు. ఈ క్రమంలో కటక్ హైవేపై మృత్యం, మలయ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువ అథ్లెట్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదం ఏ విధంగా జరిగింది? బైక్ అదుపు తప్పిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
యువ అథ్లెట్ల మృతిపై సీఎం దిగ్భ్రాంతి
ఇద్దరు క్రీడాకారులు ప్రాణాలు కోల్పోవడంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన యువ అథ్లెట్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. వారి మరణం ఒడిశా క్రీడారంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులను కోల్పోవడం బాధాకరమని పలువురు క్రీడాభిమానులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అథ్లెటిక్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న మృత్యం, మలయ్
మృత్యం దొండపాటి అథ్లెటిక్స్‌లో మంచి ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. భారత్‌లో అండర్-23 విభాగంలో స్ప్రింటింగ్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించడంతో పాటు, 2025లో వేగవంతమైన అథ్లెట్‌గా గుర్తింపు పొందినట్లు సమాచారం. మరోవైపు మలయ్ బారిక్ కూడా 400 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తన ప్రతిభను చాటుకున్నాడు. క్రీడారంగంలో మరిన్ని విజయాలు సాధించాల్సిన సమయంలో వీరిద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాల్సిన యువ క్రీడాకారులు అకాల మరణం చెందడంతో క్రీడాభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన ఈ ఘటనతో ఒడిశా క్రీడా వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులు మృతి!