
Heavy Rains: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఓ మోస్తారు నుంచి కుండపోత వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుందని ప్రకటించింది. ఇవాళ నల్లగొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
ఏపీలోనూ భారీ వర్షాలు
అటు నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. మన్యం, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందన్నారు. అటు ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Also: వరుస సెలవులు.. విద్యార్థులకు గుడ్ న్యూస్!