
ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహ బంధంతో ఒక్కటైన కొద్ది గంటల్లోనే వరుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన కేవలం 12 గంటలకే వరుడు యూనస్ మృతదేహం గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకు వేలాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఉల్ధాన్ గ్రామానికి చెందిన యూనస్‌కు ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగిసి, వివాహ రాత్రి గడిచిన అనంతరం మరుసటి రోజు ఉదయం యూనస్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే కొంతసేపటి తర్వాత గ్రామం వెలుపల ఉన్న మామిడి తోటలో ఓ చెట్టుకు వేలాడుతున్న అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.
ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై ఆత్మహత్యగా అనుమానించిన కుటుంబ సభ్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే యూనస్ మరణానికి గల అసలు కారణాలు ఏమిటన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
మరోవైపు, భర్త మరణవార్త విన్న నూతన వధువు అంజుమ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివాహమైన కొద్ది గంటల్లోనే భర్తను కోల్పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి సంబరాలతో కళకళలాడాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. యూనస్ మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని రైలు కింద పడి యువ జంట మృతి!