
అమెరికాలో తెలుగు సంఘానికి చెందిన ఓ మాజీ అధ్యక్షుడు భారీ మోసం కేసులో నేరాన్ని అంగీకరించడం కలకలం రేపుతోంది. నార్తర్న్ కాలిఫోర్నియాకు చెందిన నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (NATA) మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి గోసలపై నమోదైన ఫెడరల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చారిటబుల్ మ్యాచింగ్ ప్రోగ్రామ్‌లను దుర్వినియోగం చేయడం, పన్ను రిటర్న్‌లలో తప్పుడు వివరాలు సమర్పించడం వంటి ఆరోపణలను ఆయన కోర్టులో అంగీకరించినట్లు సమాచారం.
అమెరికా ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి డాక్టర్ రాఘవరెడ్డి గోసల నేరాన్ని ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లాభాపేక్షలేని సంస్థను ఉపయోగించుకుని విరాళాల పేరుతో భారీ మొత్తంలో నిధులను సమీకరించిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించే విరాళాలకు అదనపు మొత్తాన్ని జోడించే చారిటబుల్ మ్యాచింగ్ కార్యక్రమాలను నిందితుడు మోసపూరితంగా ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా మిలియన్ల డాలర్ల విలువైన విరాళాలకు సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.
అలాగే పన్ను రిటర్న్‌లలో విరాళాలు, నిధుల లావాదేవీలకు సంబంధించిన వివరాలను తప్పుగా చూపించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి.
లాభాపేక్షలేని సంస్థల ద్వారా నిర్వహించే చారిటబుల్ కార్యక్రమాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఈ కేసులో ప్రధానంగా ఉన్నాయి. ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఆర్థిక లావాదేవీలు, విరాళాల సేకరణ, పన్ను రిటర్న్‌లకు సంబంధించిన అంశాలను పరిశీలించిన అనంతరం కేసు ముందుకు సాగినట్లు సమాచారం.
కాగా, నాటా మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ రాఘవరెడ్డి గోసలపై వచ్చిన ఈ ఆరోపణలు అమెరికాలోని తెలుగు ప్రవాస సమాజంలో చర్చనీయాంశంగా మారాయి. కేసులో తదుపరి న్యాయ ప్రక్రియ, కోర్టు విధించే శిక్ష వంటి అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
also read: మల్టీ-స్టేట్ సైబర్ ఆపరేషన్.. 18 మంది మహిళలు సహా 101 మంది అరెస్ట్