
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గేమ్ ఛేంజ్ చేశారు. గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా తన నిర్ణయం మార్చుకుని రాజకీయ వర్గాలకు షాకిచ్చారు. అసెంబ్లీకి వెళ్లనని గతంలో ప్రకటించిన జగన్.. బడ్జెట్ సమావేశాలకు వెళ్లబోతున్నారు. అయితే జగన్ నిర్ణయంపై మరోచర్చ సాగుతోంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాలు రద్దయ్యే అస్కారం ఉంది.అందుకే ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్లి రావాలనే యోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ భయపడ్డారని.. వేటు పడితే మళ్లీ గెలవలేననే భయంతోనే అసెంబ్లీకి వస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ గేమ్ ఎందుకు ఛేంజ్ చేశారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరుకాబోతున్నారు. కాగా తొలిరోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్నాయి. ఇక ఈ నెల 28న ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.