
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అన్నారు. ఆ కాలాన్ని కేవలం చీకటి అధ్యాయం గా మాత్రమే గుర్తుంచుకోకూడదన్నారు. దాన్నొక పాఠంగా అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సంచలనం కలిగిస్తున్నాయి.
ఇందిర పాలనపై తీవ్ర విమర్శలు
దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శశిథరూర్.. ఓ మలయాళ పత్రికకు వ్యాసం రాశారు. తాజాగా ఆ వ్యాసం ప్రచురితం అయ్యింది. ఇందులో ఇందిరా గాంధీ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆమె పాలనతో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహించడంతో పాటు మురికివాడల తొలగింపు ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హింసను ఆయుధంగా చేసుకున్నారు!
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె కొడుకు సంజయ్ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాసెక్టమీపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారని మండిపడ్డారు. ఏకపక్షంగా పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఆయుధంగా ఉపయోగించారంటూ విమర్శించారు. ఇలాంటి చర్యలే నెమ్మదిగా నిరంకుశత్వంగా మారాయన్నారు. ఇవన్నీ భారత రాజకీయాల్లో మాయని మచ్చలా మిగిలిపోయాయని చెప్పుకొచ్చారు. నాటి రోజుల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు శశి థరూర్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు కారణం అయ్యాయి. పార్టీలో ఉంటూ గత కొంతకాలంగా ఆయన బీజేపీకి అనుకూలంగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఆయన వ్యాఖ్యలపై బహిరంగంగా ఇప్పటి వరకు కామెంట్స్ చేయకపోవడం విశేషం.
Read Also: హసీనాను అప్పగించండి, భారత్ ను మరోసారి కోరిన బంగ్లాదేశ్!