
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల తనిఖీల్లో మరో ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంతోష్‌నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని మాదన్నపేట సెక్షన్లో రాకేశ్ అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం ఓ వ్యక్తిని రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.1,20,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ రాకేశ్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ నిఘా కొనసాగుతోంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: దొరికిన బ్యాగులో రూ.9.48 లక్షల విలువైన విదేశీ కరెన్సీ.. ఆశపడకుండా పోలీసులకు అప్పగించిన వ్యక్తి!