
EC On Chidambaram: గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. బీహార్ లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఈసీ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా, ఆయన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఆయన లాగే ముందూ, వెనుకా చూసుకోకుండా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి పూర్తి నిరాధార వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడింది. జాతీయ స్థాయిలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకూడదని రాజకీయ నేతలకు సూచించింది.
తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియే మొదలుకాలేదు!
బీహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాతే వెల్లడి అవుతాయని ఈసీ తెలిపింది. ఓటర్లు ఎక్కడైతే నివాసం ఉంటారో ఆ నియోజకవర్గంలోనే ఓట్లు నమోదు చేయించుకోవాలని రాజ్యాంగం చెప్తోందని వివరించింది. తమిళనాడులో 6.5లక్షల ఓటర్లు పెరిగారనే తప్పుడు సమాచారం ప్రచారం కావడం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. తమిళనాడులో అసలు ఎస్ఐఆర్ ప్రక్రియే మొదలు కానప్పుడు ఓటర్లు ఎలా పెరుగుతారని ఈసీ ప్రశ్నించింది.
చిదంబరం ఏం చెప్పారంటే?
తాజాగా ఎస్ఐఆర్ పై చిదంబరం సోషల్ మీడియా వేదికగా పోస్టుపెట్టారు. బీహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా, తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని రాసుకొచ్చారు. ఈ వ్యవహారం ఆందోళనకరమే కాకుండా చట్టవిరుద్ధమన్నారు. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాలన్నారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.