
తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ దసరా పండుగ సందర్భంగా సెలవులను ప్రకటించింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేర్వేరు సెలవుల షెడ్యూల్ను వెల్లడించింది. ఈసారి పాఠశాల విద్యార్థులకు 13 రోజులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు 12 రోజుల పాటు దసరా సెలవులు లభించనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. మొత్తం 13 రోజుల పాటు స్కూళ్లు మూతపడనున్నాయి. సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. మొత్తం 12 రోజుల విరామం అనంతరం అక్టోబర్ 22 నుంచి తరగతులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 9తో SA-1 పరీక్షలు పూర్తి
ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 9న ముగియనున్నాయి. పరీక్షల షెడ్యూల్లో భాగంగా అదే రోజు నిర్వహించాల్సిన 9వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష సమయాన్ని విద్యాశాఖ సవరించింది.
తాజా షెడ్యూల్ ప్రకారం 9వ తరగతి ఇంగ్లిష్ పరీక్ష ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:15 గంటల వరకు కొనసాగుతుంది.
SA-1 పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ సందర్భంగా వరుసగా సెలవులను ఆస్వాదించనున్నారు.
also read: ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయలేదని మేనమామపై పగ.. చివరికి ఇంట్లోనే చోరీ