
జైలులో ఉన్న తన ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డబ్బు సంపాదించాలని భావించిన ఓ యువతి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కింది. బెంగళూరు నుంచి మాదక ద్రవ్యాలను తీసుకొస్తుండగా విజయవాడ రైల్వే స్టేషన్లో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ (MDMA)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ సరఫరా
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని పటమట ప్రాంతానికి చెందిన నాగసౌమ్యకు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో చిత్తూరులో అరెస్టయ్యాడు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. అతడికి బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవాలని నాగసౌమ్య భావించింది. ఈ క్రమంలో డ్రగ్స్ రవాణా చేసేందుకు అంగీకరించినట్లు పోలీసులు గుర్తించారు.
రూ.50 వేల కమిషన్ ఆశ చూపిన సరఫరాదారు
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన బషీర్ అనే వ్యక్తి నాగసౌమ్యకు రూ.50 వేల కమిషన్ ఇస్తానని ఆశ చూపించాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అప్పగిస్తే ఈ మొత్తం చెల్లిస్తానని చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నాగసౌమ్య ఈ నెల 13న బెంగళూరులోని యలహంకకు వెళ్లింది. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 110 గ్రాముల ఎండీఎంఏను తీసుకుంది. అనంతరం బెంగళూరు–హౌరా ఎక్స్ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది.
పోలీసుల తనిఖీలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
ముందస్తు సమాచారం అందడంతో ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ నేతృత్వంలోని బృందాలు విజయవాడ రైల్వే స్టేషన్లో నిఘా ఏర్పాటు చేశాయి. రైలులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయాన్ని గమనించిన నాగసౌమ్య, వెంటనే బషీర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో అతడు స్టేషన్ నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నాగసౌమ్యను తనిఖీ చేసిన పోలీసులు.. ఆమె ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించిన జేబులో దాచిన డ్రగ్స్ ప్యాకెట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు.
బషీర్ కూడా పోలీసుల అదుపులోకి..
ఈ ఘటనలో పరారైన బషీర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బుధవారం విజయవాడలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
also read: బెంగళూరు పబ్ ఘటన.. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్పై ఏపీ ప్రభుత్వం చర్యలు!