
-
11.18 లక్షల ఎకరాల పంటలపై ప్రభావం
-
గణనీయంగా తగ్గుముఖం పడుతున్న భూగర్భ జలాలు
-
డిసెంబరు వరకు మాత్రమే సింగూరు జలాలు
-
మోగుతున్న ప్రమాద ఘంటికలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో తీవ్ర కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. తీవ్ర దుర్భిక్షం వెంటాడుతోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం కొనసాగుతోంది. భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి సైతం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
లోటు వర్షపాతం కారణంగా 11.18 లక్షల ఎకరాల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధ శాఖల పరిధిలోని పరిస్థితులపై నివేదికలు తెప్పించుకొని ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుపై కసరత్తు మమరం చేసింది రేవంత్ సర్కార్.
-
వర్షపాతం లోటు..
ఈ ఏడాది జూన్ నుంచి తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. వర్షపాతంలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఖరీఫ్ పై పెను ప్రభావం ఉంది. 11.18 లక్షల ఎకరాలపై కరువు ప్రభావం ఉంది. దాదాపు 300 మండలాలకు పైగా కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇంకోవైపు రిజర్వాయర్లలో కనీస స్థాయిలో కూడా నీరు లేదు.
డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి జలాలు. కాలువులతో పాటు చెరువులు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఒరిస్సాగు సజావుగా ముందుకు వెళ్లేలా లేదు. వాస్తవానికి వరి సాగు విస్తీర్ణం గత ఏడాది 69.19 లక్షల ఎకరాలు.. కానీ ఈ ఏడాది 57.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయింది. వరి పంటలతో పాటు పత్తిపై కూడా ప్రభావం చూపింది
-
తాగునీటి కష్టాలు..
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు కూడా ప్రారంభం అయ్యాయి. సింగూరు జలాలు డిసెంబరు వరకే అని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మిషన్ భగీరథకు 50 టీఎంసీలు, హైదరాబాద్ వాటర్ బోర్డుకు 20 టీఎంసీలు అవసరం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు అందాయి.
ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో కృష్ణా ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 20070 టీఎంసీలకు గాను 71 శాతం లోటుతో.. 78.5 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. గోదావరి బేసిన్ లో 145.7 టీఎంసీలకు 34% లోటుతో 96 టిఎంసిలు నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ప్రత్యేకించి సింగూరు జలాశయం నిలవ సామర్థ్యం 29.91 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం మూడు టీఎంసీల నిల్వలే ఉన్నాయి. అవి డిసెంబర్ వరకే సరిపోతాయి. రాష్ట్రవ్యాప్తంగా 40434 చెరువులకు గాను.. 40 శాతం వాటిలో పావు వంతు కంటే తక్కువ నీరు ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటూ మిగులు ఉన్నచోట మాత్రమే పంటలకు ఒక తడి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు.
హైదరాబాదులో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. 14.5 లక్షల నల్ల కనెక్షన్ల ద్వారా 1.30 కోట్ల మందికి తాగునీరు సరఫరా అవుతుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి సింగూరు, మంజీరా పరిధిలో సరఫరా లోటు ఏర్పడి మూడు లక్షల కనెక్షన్లపై ప్రభావం పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో అధికారులు సిద్ధపడుతున్నారు.