
Oats: ఓట్స్‌ను ప్రతిరోజూ అల్పాహారంగా తీసుకునే అలవాటు ఇప్పుడు చాలా మందిలో సాధారణమైపోయింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ, తక్కువ సమయంలో తయారయ్యే ఈ ఆహారాన్ని ఎక్కువ మంది ప్రధాన ఆహారంగా భావిస్తున్నారు. అయితే నిపుణుల మాట ప్రకారం.. రోజూ ఒకే రకం ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మంచిదని చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఓట్స్‌ను ప్రతిరోజూ తీసుకోవడం కొంతమందికి అనుకోని ప్రతికూల ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగించడంతో అది మంచి అల్పాహారంగా ప్రసిద్ధి చెందినా, రోజూ అదే ఆహారం తీసుకోవడం శరీర వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుందని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.
మణిపాల్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ పవిత్ర ఎన్ రాజ్ మాట్లాడుతూ.. ఓట్స్ గ్లూటెన్ ఫ్రీగా ఉండే ధాన్యం అయినప్పటికీ, చాలా పరిశ్రమల్లో గోధుమ, బార్లీ వంటి గ్లూటెన్ కలిగిన ధాన్యాలతో పాటు ప్రాసెస్ చేస్తారని తెలిపారు. ఈ ప్రాసెసింగ్ సమయంలో కలిగే క్రాస్ కాలుష్యం కారణంగా సెలియాక్ వ్యాధి ఉన్నవారికి లేదా గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగానూ సర్టిఫైడ్ గ్లూటెన్ రహిత ఓట్స్‌ను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా, నాణ్యతలేని ఓట్స్‌ను తీసుకుంటే కడుపు ఉబ్బరం, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చని కూడా వివరించారు.
ఓట్స్‌లో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయినప్పటికీ, ఎక్కువ ఫైబర్‌ను ఒక్కసారిగా శరీరంలోకి తీసుకుంటే, అలవాటు లేని వారికి గ్యాస్, ఉబ్బరం, బరువు పెరిగినట్లు అనిపించడం వంటి సమస్యలు సాధారణమని చెబుతున్నారు. అలాగే, ఓట్స్ బరువు నియంత్రణలో సహాయపడతాయని భావించినప్పటికీ, అవి తక్కువ కేలరీల ఆహారం కాదని చాలా మందికి తెలియదు. 100 గ్రాముల ఓట్స్‌లో దాదాపు 379 కేలరీలు ఉండటంతో, వాటిని పండ్లు, నట్లు కలిపి తింటే కేలరీలు మరింత పెరిగి బరువు పెరగడం కూడా సాధ్యమే. అందుకే వారంలో కొన్ని రోజులు అల్పాహారంలో మార్పులు చేసుకుంటూ పెరుగు, స్మూతీలు, కూరగాయల ఆమ్లెట్ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
NOTE: పై సమాచారాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే ప్రచురించాము. మీరు డైట్ చేసేటప్పుడు వైద్యుల సలహా తప్పకుండా పాటించగలరు. ‘క్రైమ్ మిర్రర్’ దీనిని ధృవీకరించలేదు.
ALSO READ: VIRAL NEWS: ఇక ఇళయరాజా ఫోటో వాడినా జైలుకే!





