
– రీఎంట్రీ కి గట్టి ప్రయత్నాలు
– తాను జగన్ భక్తుడినని వ్యాఖ్య
– ధర్మాన సోదరుల అనుమతి లేకుండా అసాధ్యం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో :-
దువ్వాడ శ్రీనివాస్ ఒక సాధారణ ఎమ్మెల్సీ.. అయినా సరే తన వ్యక్తిగత వ్యవహారంతో సెలబ్రిటీగా మారిపోయారు. కుటుంబ, వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అయితే తిరిగి ఆ పార్టీలో చేరేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీలో రీఎంట్రీకి గట్టి ప్రయత్నం లో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. తిరిగి తనను పార్టీలో చేర్చుకోవాలని వైసిపి పెద్దలను విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చి తాను జగన్మోహన్ రెడ్డికి భక్తుడిని అని చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే రాజకీయంగా ఎదిగిన విషయాన్ని చెప్పుకొస్తున్నారు. తన సస్పెన్షన్కు ముమ్మాటికి జిల్లా వైసీపీ నాయకత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. పార్టీలోకి తిరిగి వస్తానన్న సంకేతాలు పంపుతున్నారు.
అంత సులువు కాదు..
వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ చేరడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల హవా ఉంది. వారు వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్నారు. వారిని కాదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వారిని ఓడిస్తానని శపధం కూడా చేశారు. వారి మధ్య స్పష్టమైన విభజన కూడా వచ్చింది. అందుకే ధర్మాన సోదరులు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో అసలు సానుకూలంగా లేరు. పార్టీలో చేర్చుకుంటామంటే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించే అవకాశం ఉంది. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ కంటే ధర్మాన సోదరుల బలం ఎక్కువ. పైగా దువ్వాడ శ్రీనివాస్ పై వివాదాస్పద ముద్ర ఉంది.
ఆగ్రహంలో కాళింగులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాళింగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం తగ్గిపోయింది. ధర్మాన సోదరుల మూలంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినట్టే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో కూడా అలానే జరిగింది. ఆయనను ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు నుంచి తొలగించారు. ఈ పరిణామం వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు. దీని వెనుక కూడా ధర్మాన సోదరుల హస్తం ఉందన్న ఆరోపణలు దువ్వాడ శ్రీనివాస్ నుంచి నేరుగా వినిపించాయి. ఇలా కాళింగ సామాజిక వర్గం నేతలను ఒక పద్ధతి ప్రకారం బయటకు పంపించారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. వైసీపీకి ఇది మైనస్ గా మారుతోంది. అందుకే దువ్వాడ శ్రీనివాసును తిరిగి వైసీపీలో చేర్చుకుంటారన్న ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.