తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ ధరణిని పూర్తిగా మార్చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి స్థానంలో కొత్తగా భూభారతిని తీసుకొచ్చింది. భూభారతి బిల్లు-2024ను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
భూమిపై హక్కుల రికార్డు -2024లోని ముఖ్యాంశాలు ఇవే..
🔸అనుభవదారుడి వివరాలు కూడా రెవెన్యూ రికార్డులో నమోదు కానున్నాయి. అనుభవదాడికి ఈ చట్టం రక్షణగా నిలువనుంది. ప్రస్తుత ధరణి చట్టంలో ఈ అవకాశం లేదు.
🔸ధరణిలో ఉన్న తప్పులను సవరించడానికి, భూమి ఉండి కూడా కొత్త పాస్ పుస్తకాలు రాని వాళ్లకు (పార్టు-బీ కేసులకు) రికార్డుకు ఎక్కించి పాస్ పుస్తకాలను ఇచ్చే విధంగా కొత్త చట్టం రూపొందించడం జరిగింది.
ఈ తరహా భూ సమస్యలను పరిష్కరించడానికి లేదా ఈ పని చేయడానికి లేదా సరి చేయడానికి తహశీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ల అధికారం కల్పించడం జరిగింది.
🔸ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే కొత్త చట్టం కింద రికార్డుగా నమోదు కానుంది. ఇప్పుడున్న ధరణి రికార్డు అప్పటి వరకు తాత్కాలికంగానే కొనసాగనుంది. ప్రక్షాళన చేసి కొత్త రికార్డును రూపొందించడం జరుగుతుంది. భవిష్యత్తులో భూ సర్వేను కూడా చేసి రికార్డును రూపొందించుకునే అవకాశం కల్పించడం జరిగింది.
🔸రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెనువెంటనే మ్యుటేషన్ జరిగి పాస్ పుస్తకం వస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఈ చట్టం కల్పిస్తోంది.
🔸మ్యుటేషన్‌కి మ్యాప్ తప్పని సరిగా ఉంటుంది. పాస్ పుస్తకంలో కూడా మ్యాప్ ఉంటుంది. దీంతో సరిహద్దు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.
🔸వారసత్వ భూములకు నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఇంతకు ముందు ఎలాంటి విచారణ లేకుండానే జారీ చేయడంతో అన్నదమ్ముల మధ్య కుటుంబాలలో వివాదాలకు కారణం అయ్యేది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు.
🔸13బీ, 38ఈ, ఓఆర్‌సీ, లావుని పట్టా వంటి మార్గాలలో భూమి వచ్చినప్పుడు పాస్‌పుస్తకాలు పొందే అవకాశం పాత చట్టంలో లేదు. వీరందరికీ కూడా పాస్ పుస్తకాలను ఆర్డీఓ ద్వారా ఇచ్చే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది.
🔸సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న సుమారు 9 లక్షల పైగా ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. పాత చట్టంలో ఈ అవకాశం లేదు.
🔸గ్రామ కంఠం, ఆబాదీలకు కూడా హక్కుల రికార్డును ఈ చట్టం కల్పిస్తోంది.
🔸మనిషికి ఆధార్ వలె భూ యజమానులకు భూధార్ ఇవ్వడం జరుగుతుంది.
🔸భూ సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేకం భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగనుంది. ఏ విధమైన భూ సమస్యలున్నా కోర్టులకు వెళ్ల కుండా జిల్లా స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది.
ఏ రైతైనా ఆర్ధిక ఇబ్బందులు, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకోలేని పరిస్థితి ఉంటే, అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అంద చేస్తోంది.
🔸ఇక నుంచి గ్రామ స్థాయిలోనే రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుంది. కొత్త చట్టంతో గ్రామానికో రెవెన్యూ అధికారి రానున్నారు.
రెవెన్యూ సేవలు క్షేత్ర స్తాయిలో అందుబాటులోకి రానున్నాయి.