
క్రైమ్ మిర్రర్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఐటీ పార్కులో గురువారం మధ్యాహ్నం సిలిండర్ పేలిన ఘటనలో ఓ వలస కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేగింది.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపురం గ్రామంలోని ఆక్సి నౌ మెడికల్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ కంపెనీలో గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్ (21) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామానికి చెందిన ఎం. హరిప్రసాద్ (23) తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రికి తరలింపు
ప్రమాద సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడు మనీష్ కుమార్ మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన హరిప్రసాద్ను మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు.. దర్యాప్తు
ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మథకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read : అమెరికాలో ఘోర కాల్పులు.. ముగ్గురు చిన్నారులు, టీచర్ మృతి.. నిందితుడిని కాల్చి చంపిన పౌరుడు!