Crime Mirror
Breaking News
Follow Us
Date of Publish: July 16, 2026
Digital Edition: Crime Mirror

పసికందుపై కర్కశత్వం.. బ్లేడ్‌తో గాయపరిచి, ముళ్లపొదల్లో పడేసిన దుండగులు

సమాజంలో మానవత్వం రోజురోజుకూ కనుమరుగవుతోందనడానికి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. ఎనిమిది నెలల పసికందుపై అత్యంత దారుణంగా దాడి చేసి, బ్లేడుతో శరీరంపై గాట్లు పెట్టి రక్తస్రావమయ్యేలా చేసి ముళ్లపొదల్లో పడేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన సతీష్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య శైలజకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, రెండో భార్య సంధ్యకు ఎనిమిది నెలల వయస్సున్న వర్ష అనే పాప ఉంది. శైలజ, సంధ్య ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదు నెలల క్రితం సతీష్ తన రెండో భార్య సంధ్యతో గొడవపడి, చిన్నారి వర్షను తన వద్దే ఉంచుకుని సంధ్యను ఆమె పుట్టింటికి పంపించినట్లు స్థానికులు తెలిపారు.

శుక్రవారం ఉదయం చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బంధువులు, కులస్తులు కూడా గాలింపులో పాల్గొన్నారు. ఈ క్రమంలో సతీష్ ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో చిన్నారి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి శరీరంపై బ్లేడుతో కోసినట్లుగా అనేక గాయాలు ఉండటంతో పాటు రక్తస్రావం కనిపించింది. వెంటనే చిన్నారిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటన వెనుక అసలు కారణాలేమిటి? చిన్నారిపై ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బంధువులు పోలీసులను కోరుతున్నారు. ఈ అమానుష ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది.

also read : ఆదిలాబాద్‌లో ఏసీబీ మెరుపుదాడి.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఇరిగేషన్ అధికారులు

Home