అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బంపర్ విక్టరీ సాధించారు. 3 వందల మార్క్ దాటి ఎలక్టోరల్ ఓట్లు సాధించి సత్తా చాటారు. డెమాక్రట్ అభ్యర్థిగా కమలా హారిస్ ఉండటంతో ఈసాపి ట్రంప్ గట్టెక్కడం కష్టమనే ప్రచారం ఎక్కువగా సాగింది. కాని ట్రంప్ ముందు పూర్తిగా చతికిలపడిపోయారు కమలా హారిష్.
కమలా హారిస్… నాలుగేళ్ల క్రితం అమెరికా ఉపాధ్యక్షురాలిగా డైనమిక్ లేడీగా పరిచయమైన ఈమె అధ్యక్ష ఎన్నికలకు వచ్చేసరికి చతికిలపడింది. 2021లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించిన డెమోక్రాట్లు ఈసారి మాత్రం ఆ ఉత్సాహాన్ని కనబరచలేకపోయారు. ప్రజాస్వామ్యం, శాంతి అంటూ యుద్ధాలను ప్రోత్సహించడం జో బైడెన్ సారథ్యంలోని డెమోక్రటిక్ పార్టీని భారీగా దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగా… అమెరికా పరోక్షంగా యుద్ధాల్లో భాగస్వామ్యమైంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ, ఆర్థిక సాయం, గాజాలో ఇజ్రాయెల్‌కు సాయం చేయడం స్థానికంగా వ్యతిరేకతకు కారణమయ్యాయి. ట్రంప్ అధికారంలో ఉంటే రష్యాతో సరిగ్గా డీల్ చేసేవారని స్వింగ్ స్టేట్స్‌లో నిర్వహించిన సర్వేల్లో ఓటర్లు అభిప్రాయపడ్డారంటే పరిస్థితి అర్థమవుతుంది. చైనా విషయంలోనూ బైడెన్ అత్యంత బలహీనంగా కనిపించారు. ఇజ్రాయెల్‌ను కట్టడి చేయడంలో విఫలమైనందున అమెరికన్ అరబ్‌లు బైడెన్ సర్కారుకు బుద్ధిచెప్పాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు ట్రంప్ తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో యుద్ధాన్ని ఆపేస్తానని హామీ ఇచ్చారు. మిషిగన్ లాంటి రాష్ట్రాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ఉక్రెయిన్ యుద్ధప్రభావం ప్రపంచదేశాలతో పాటు అమెరికాపైనా పడింది. ఆర్థిక మందగమనం ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా సగటు అమెరికా ప్రజలు ఇబ్బందులు పడడం ఆరంభమైంది. జీవన వ్యయం పెరగడానికి తోడు ఉద్యోగాల్లో కోతలు అమెరికన్లలో బైడెన్ సర్కారుపై ఆగ్రహాన్ని పెంచాయి. స్వదేశంలో ఆర్థికస్థితి దిగజారుతుంటే… పట్టించుకోకుండా వందల కోట్ల డాలర్లను ఉక్రెయిన్‌కు కట్టబెట్టడం వారిలో అగ్నికి ఆజ్యం పోసింది. ముఖ్యంగా గ్రామీణ అమెరికాలో వ్యతిరేకత పెరిగింది. ట్రంప్‌నకు అమెరికాలోని గ్రామీణ ఓటర్ల నుంచి బలమైన మద్దతు ఉంది. అయోవా లాంటి రాష్ట్రాల్లో ఆయన విజయం సాధించడానికి ఇదే కారణంగా నిలిచింది. ఇక జార్జియా, కెంటకీ, నార్త్ కరోలినాల్లో ఇదే ఆయనకు ఆధిక్యం తీసుకొచ్చింది.
వయసు పైబడుతున్నా… ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా… మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్న జో బైడెన్ నిర్ణయంతో డెమోక్రాట్లపై ప్రజలకు విసుగెత్తింది. చివరకు ఆయన స్థానంలో కమలా హారిస్‌ను హడావుడిగా అభ్యర్థిగా ప్రకటించినా… బైడెన్ ప్రభావం ఆమె మెడకు చుట్టుకుంది. ఉపాధ్యక్షురాలిగా పనిచేసినందున… బైడెన్ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిలో కమల పాత్ర కూడా ఉన్నట్లు ప్రజలు భావించారు. ఫలితంగా తాను కొత్తగా చేస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని హామీ ఇచ్చినా ప్రజలు అంతగా నమ్మలేదని తెలుస్తోంది. . తొలి మహిళా అధ్యక్షురాలు అనే సెంటిమెంట్ కంటే… ఇంటి బడ్జెట్ తలకిందులవుతున్న తీరే వారిని ప్రభావితం చేసింది.
ఇక నిధుల సేకరణలో కమలా హారిస్ సక్సెస్ సాధించినా… ఓటర్లను పెద్దగా ఆకర్శించలేకపోయారు. ట్రంప్‌తో పోలిస్తే ఆమె ప్రసంగాలు చాలా పేలవంగా… అస్పష్టంగా ఉంటాయనే పేరు వచ్చింది. ప్రచారంలో అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె దాటవేత సమాధానాలివ్వడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. వీటన్నింటికీ తోడు డెమోక్రటిక్ పార్టీలో సమన్వయ లోపం కూడా ఆమెను ఇబ్బంది పెట్టింది.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రచారం డెమోక్రాట్లను దెబ్బతీసింది. ముఖ్యంగా వలసలపై, పెరిగిన జీవన వ్యయాలపై ట్రంప్ పదేపదే ప్రస్తావించారు. బైడెన్-కమల హయాంలో లక్షల సంఖ్యలో అక్రమంగా వలసలు వచ్చారని ట్రంప్ లెక్కలతో చూపించి… శ్వేతజాతీయులను ఆకట్టుకున్నారు. ఉత్తర అమెరికాలో అక్రమ వలసదారులు పెద్ద సమస్యగా మారారు. ఈ విషయాన్ని ట్రంప్ బలంగా వినియోగించుకున్నారు. అదే సమయంలో… డెమోక్రాట్లకు బలమైన కోటగా ఉండే కార్మికులను, వారి సంఘాలను పెరిగిన జీవన వ్యయాలను చూపి బుట్టలో వేసుకున్నారు. వరుసగా రెండుసార్లు జరిగిన హత్యాయత్నాలు ఆయనపై సానుభూతిని పెంచాయి. యువ ఓటర్లు కూడా ఈసారి ఎక్కువగా ఆయన వైపే మొగ్గినట్లు తెలుస్తోంది.