తెలంగాణ

పవర్‌ లూమ్‌ కార్మికుల సమస్యలు తీర్చండి… సీఎం రేవంత్‌రెడ్డికి ఆలిండియా పద్మశాలి సంఘం వినతి

  • కార్మికులు ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారు

  • త్రిఫ్ట్‌ ఫండ్‌, ఆరోగ్య బీమా, వర్కర్‌ టు ఓనర్‌ అమలు చేయాలి

  • కార్మికులకు సంక్షేమ పథకాలకు పారదర్శకంగా అందజేయాలి

  • కార్మికుల వలసలు, ఆత్మహత్యలతో అవస్థలు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పవర్‌లూమ్‌ (మరమగ్గాలు) కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అఖిల భారత పద్మశాలి సంఘం నేతలు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మరమగ్గాల కార్మికులు ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీంతో వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను ఆ సంఘం నేతలు కోరారు.

చాలా ప్రాంతాల్లో పవర్‌ లూమ్‌ కార్మికులు తక్కువ కూలీ, ఉపాధి కొరతతో ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. మరమగ్గాల యజమానులు కూలీ రేట్లను పెంచడానికి నిరాకరిస్తున్నారని, దీని వల్ల కార్మికులు తమ రోజువారీ జీవన ఖర్చులను భరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేకపోవడం, ఆర్డర్లు ఆలస్యం కావడం వల్ల సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ పార్కులు మూతపడుతున్నాయని, దీనివల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని అన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కార్మికులకు వేతనాలు ఆలస్యమవుతున్నాయన్నారు.

త్రిప్ట్ ఫండ్ పథకం కింద రూ.1200 చెల్లిస్తే, రూ.2400 లబ్ది పొందే అవకాశం అందరికీ అందుబాటులో లేదన్నారు. ఈ పథకం అమలులో స్పష్టత లేకపోవడం, ఆలస్యం జరగడం వంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఆరోగ్య బీమా పథకం అమలులో లోపాలు ఉండడం వల్ల కార్మికులు వృత్తి సంబంధిత, అనారోగ్యాల నుంచి రక్షణ పొందలేకపోతున్నారని వివరించారు. గతంలో చేనేత, మరమగ్గాల కోసం రూ.1200 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు రూ.371 కోట్లకు తగ్గడం పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందన్నారు. వర్కర్ టు ఓనర్ పథకం సరిగ్గా అమలు కాకపోవడం, దానికి తగిన నిధులు కేటాయించకపోవడం కార్మికులలో అసంతృప్తిని కలిగిస్తోందన్నారు.

సిరిసిల్లలో రూ.100 కోట్లకు పైగా విలువైన పాలిస్టర్ వస్త్రాలు నిల్వలో ఉండడం వల్ల కార్మికులకు పని లేకుండా పోతోందన్నారు. ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, నిర్మాణ రంగ కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక సమస్యల కారణంగా కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ప్రభుత్వానికి పద్మశాలీ సంఘం విజ్ఞప్తులు:

  1. కూలీ రేట్లను సమీక్షించి, వాటిని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆర్డర్లను సకాలంలో అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించాలి
  2. త్రిప్ట్ ఫండ్, ఆరోగ్య బీమా, వర్కర్-టు-ఓనర్ వంటి సంక్షేమ పథకాల అమలును పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించాలి.
  3. మరమగ్గ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సహకార సంఘాలను బలోపేతం చేయడం, అమ్ముడుపోని సరుకును కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి.
  4. బడ్జెట్లో మరమగ్గాల పరిశ్రమకు తగిన నిధులు కేటాయించి, కొత్త టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి.
  5. కార్మికుల ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి వడ్డీ రహిత రుణాలు, ఆర్థిక సహాయం అందించాలి.

Read Also: 

బీసీ రిజర్వేషన్లపై ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్‌రెడ్డి

సీఎం రేవంత్‌కి భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి: బీజేపీ చీఫ్‌

Back to top button