
నిత్యం ఏదో ఒక వివాదాస్పద లేదా సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), తాజాగా నెట్టింట కలకలం రేపుతున్న ‘చుట్టమల్లే’ ఏఐ వీడియో వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ఈ ఏఐ వీడియో వివాదంపై పలువురు సినీ తారలు, ప్రముఖులు వరుసగా ట్వీట్లు చేస్తుండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.సెలబ్రిటీలు చూపిస్తున్న ఈ తీరుపై ఆర్జీవీ తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. “ఒక అసభ్యకరమైన వీడియో లింక్, అందులోని అభ్యంతరకర కంటెంట్‌ను కోట్లాది మంది సామాన్య ప్రజలు చూసే విధంగా మన సినీ సెలబ్రిటీలు తమ ట్వీట్లతో దానికి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టారు” అని ఆయన ఆరోపించారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో సినీ ప్రముఖులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పరోక్షంగా చురకలంటించారు.
అసలు ఇలాంటి ఫేక్ వీడియోలను ఎవరు క్రియేట్ చేశారు? ఆ తప్పు చేసిన అసలు నిందితుడు ఎవరు? అనే కోణంలో విచారణ జరిగేలా చూసి, నిందితుడి వివరాలను పబ్లిసిటీ చేసి ఉంటే సమాజానికి మేలు జరిగేదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. కానీ దానికి పూర్తి భిన్నంగా, సెలబ్రిటీలు పెట్టిన పోస్టుల కారణంగా బాధితురాలి పైనే, అలాగే ఆ అసభ్యకర కంటెంట్ పైనే అందరి దృష్టి పడేలా చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదిలేసి, ఇలా అందరి దృష్టి ఆ వీడియో కంటెంట్ వైపు మళ్లేలా చేయడం కూడా ఒక రకమైన నేరమే అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లో కుండబద్దలు కొట్టారు.