
ఈశాన్య రుతుపవనాల తీవ్ర ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు ఉన్న 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం గమనార్హం. 2023లో సంభవించిన మిగ్జామ్ తుఫాను తర్వాత చెన్నై నగరంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు, నీటి ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 24 గంటల్లో కూడా పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే చెన్నై పరిధిలోనూ అతిభారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను యంత్రాంగం వేగవంతం చేసింది.
బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ