
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టిన ఘటన ఢిల్లీలోని పశ్చిమ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కారు నడిపిన మహిళ వాహనం దిగి గాయపడిన దంపతులను పరిశీలించి అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శుక్రవారం ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో కీర్తి నగర్‌లోని ఆర్య సమాజ్ మందిరం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న 70 ఏళ్లు పైబడిన దంపతులను వేగంగా వచ్చిన హ్యుందాయ్ క్రెటా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న మహిళ వాహనం నుంచి బయటకు వచ్చి గాయపడిన దంపతుల పరిస్థితిని పరిశీలించింది. వారు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు గాయపడిన దంపతులకు ప్రాథమిక సాయం అందించి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో వృద్ధుడి ముఖం, తలకు గాయాలయ్యాయి. ఆయన భార్యకు కూడా గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులను 79 ఏళ్ల దయానంద్, 71 ఏళ్ల కుసుమ్గా గుర్తించారు. వారి పిల్లలు అమెరికాలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ అరెస్ట్
ప్రమాదానికి కారణమైన కారును నడిపిన మహిళను 49 ఏళ్ల నవలీన్ కౌర్‌గా పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి గాయాలకు కారణమైనందుకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : పడవ బోల్తా.. బాలుడితో సహా ముగ్గురు మృతి