తెలంగాణ

బిడ్డా రేవంత్.. మూడు చెరువుల నీళ్లు తాపిస్తా!

వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు ఉద్వేగ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదివేల మంది స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనే దానికి నిదర్శనమన్నారు హరీష్. కొత్త పథకాలు రాలేదు, పథకాలు బంద్ పెడుతున్నడు..బతుకమ్మ చీరెలు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, చెరువుల్లో చేప పిల్లలు లేవని అన్నారు. బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది కనుక ఆ మాత్రం అయినా చేస్తున్నారని చెప్పారు.

వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు అవుతుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. అయితే దేవుని మీద వొట్లు.. అడిగితే తిట్లు.. తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయని అన్నారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ.. చంద్రబాబు, వైఎస్ మీద పోరాటం చేసినోళ్ళం.. రేవంత్ రెడ్డి ఓ లెక్కా అన్నారు. డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ చేస్తా అన్నడు చెయ్యలేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో పంద్రాగస్టు వరకు చేస్తం అని మాట తప్పారని విమర్శించారు. కురుమూర్తి, జోగులాంబ అమ్మవారు, లక్ష్మి నరసింహ స్వామీ మీద వొట్లు వేసి మాట తప్పిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అన్నారు హరీష్ రావు. 45 వేల కోట్లు అని చెప్పి సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు.

కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇస్తే నిబంధనలు పెట్టీ రుణమాఫీ ఎగవేశారని హరీష్ రావు మండిపడ్డారు. పాలకుడు దేవుళ్ళ మీద వొట్లు పెట్టి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టం అవుతుందన్నారు. అందుకే నేను దేవుడి దగ్గరకి వెళ్లి ప్రజల్ని కాపాడు, పాపాత్ముడిని క్షమించు అని వేడుకున్నానని చెప్పారు. మోసం చేసినవు..నీ పేరు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు.

పది నెలలు అయ్యింది మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలు చేయలేదు అంటే బేగం బజార్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు..బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నీ హామీలు అమలు చేసేదాకా నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాను. బేగం బజార్ కాదు ఏ బజార్ లో కేసులు పెట్టుకుంటవో పెట్టుకో అంటూ హరీష్ రావు సవాల్ చేశారు. మూసి పేరిట లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు కానీ రైతులకు రైతు బంధు ఇచ్చేది లేదని విమర్శించారు.

అన్ని వర్గాలను రోడ్ల మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు హరీష్ రావు. జీవో 29 తెచ్చి ఎస్సీ, ఎస్టీ లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని ఫైరయ్యారు. అన్యాయం అంటే పిల్లల ఈపులు పగల కొడుతున్నడు..ప్రజా పాలన అన్నడు. అర్థరాత్రి విద్యార్థులను గొడ్డును కొట్టినట్లు కొట్టిస్తున్నారని ఆరోపించారు. పోలిసొల్లను నమ్మడం లేదు. స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారని అన్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తానని చెప్పారు హరీష్ రావు. మహిళలకి 2500 మహాలక్ష్మి, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు చెప్పినట్లు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. తెలంగాణ భవన్ లో లీగల్ సెల్ ఏర్పాటు చేశామని.. 480 మందికి స్తే తెచ్చి ఇల్లు కులగొట్టకుండా చూశామన్నారు. అతి చేస్తున్న పోలీసుల పేర్లు డెయిరీలో రాస్తున్నామని.. అందరి సంగతి తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు హరీష్ రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button