
క్రైమ్ మిర్రర్,మంచిర్యాల:- తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ, విజయదశమి వేడుకల సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రజలకు, ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని, సంతోషాన్ని నింపాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా బతుకమ్మ ఆడే విధానంలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. “చిన్నతనంలో ఉదయాన్నే లేచి చెట్లు, చేమల వెంబడి కట్ల పూలు, గుమ్మడి పూలు సేకరించి బతుకమ్మను పేర్చేవాళ్లం. సాయంత్రం అందరం ఒకచోట చేరి సాంప్రదాయ పాటలతో బతుకమ్మ ఆడేవాళ్లం” అని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నేటి తరం సాంప్రదాయ పాటలతో పాటు డాండియా, కోలాటాలు, ఫోక్ డాన్సులతో ఆధునిక రీతిలో వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ… బతుకమ్మను పేర్చే విధానం మాత్రం నేటికీ సాంప్రదాయబద్ధంగానే కొనసాగడం అభినందనీయమన్నారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిలో లభించే పువ్వులను సేకరించి గౌరీదేవిగా భావించి పూజించడం తెలంగాణ ఆడబిడ్డల ప్రత్యేకత అని సురేఖ కొనియాడారు. మహిళలంతా ఒక్కటై తమ కష్టసుఖాలను పంచుకుంటూ పుట్టింట్లో ఆనందంగా జరుపుకునే పండుగ ఇదని వివరించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను నేటి యువత కూడా సగర్వంగా స్వీకరించి, భావితరాలకు అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
‘రామాయణం’పై రాజమౌళి ప్రశంసలు.. నవంబర్ 5 కోసం ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్!