
– సూరారంలో తల్లిదండ్రుల ఆరోపణలు
– ఆరోపణలు నిజమేనా?.. విచారణతో తేల్చాలని డిమాండ్
– సరఫరా అవుతున్న గుడ్లను తనిఖీ చేయాలని విజ్ఞప్తి
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి:-జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న గుడ్ల నాణ్యతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో నాణ్యత లేని గుడ్లు అందిస్తున్నారంటూ కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ చిన్నారికి అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించిన గుడ్డు తిన్న అనంతరం వాంతులు అయ్యాయని ఓ తల్లి ఆరోపించింది. ఈ ఘటనతో చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అయితే గుడ్డు తినడం వల్లే వాంతులు అయ్యాయా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది వైద్యపరంగా నిర్ధారించాల్సి ఉంది.
గుడ్ల నాణ్యతపై అనుమానాలు
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న గుడ్లను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి
చిన్నారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సూరారం అంగన్వాడీ కేంద్రంలో గుడ్ల సరఫరా, నిల్వ విధానం, నాణ్యతపై సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల ఆహారం విషయంలో నాణ్యతే ముఖ్యం.. ఆరోగ్యంతో చెలగాటం వద్దంటున్న తల్లిదండ్రులు.