
క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు వెళ్తున్న యువతీ, యువకులపై దాడి ఘటన కలకలం రేపింది. హిందూ రక్షా దళ్‌కు చెందిన వ్యక్తులుగా చెప్పుకుంటున్న కొందరు యువకులపై దాడికి పాల్పడటంతో పాటు, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
నిరసనకు వెళ్తుండగా దాడి
శనివారం జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న యువతీ, యువకులపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీయూ మార్గ్ సమీపంలో కొందరు వ్యక్తులు విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ మహిళను నేలపైకి తోసి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడ పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
వీడియో వైరల్.. నలుగురు అరెస్ట్
దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందకపోయినప్పటికీ, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రమణ్ సైని, వివేకానంద్ అలియాస్ వివేక్, కపిల్ కుమార్, రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూను అరెస్ట్ చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read : మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఐదుగురు మృతి