
గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరిగా ఉన్న ఓ యాచకురాలిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు ఈ దారుణానికి యత్నించినట్లు సమాచారం. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని పరిధిలోని ఓ పూల దుకాణం వద్ద యాచకురాలు నిద్రిస్తుండగా, రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సాంబశివరావు అనే రౌడీషీటర్ అక్కడికి వచ్చాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా, బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితుడు ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
బాధితురాలి కేకలు, అక్కడి కుక్కల అరుపులతో పరిసరాల్లోని వారు అప్రమత్తమయ్యారు. స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని సాంబశివరావుగా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
ఒంటరిగా ఉన్న మహిళపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
also read: తాపీ నదిలో నవదంపతుల మృతదేహాలు.. కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం!