
నగరంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 24 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరుతోనే తన భార్య ఓటును తొలగించాలంటూ ఫారం-7 దరఖాస్తు సమర్పించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ దరఖాస్తు ఆధారంగా సదరు మహిళ ఓటు తొలగిపోవడంతో విషయం బయటపడింది.
ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోలక్‌పూర్‌కు చెందిన బిల్కిస్ సుల్తానా మూడు దశాబ్దాలుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆమె భర్త మహ్మద్ రఫీఖుద్దీన్ 2002లోనే మృతి చెందారు. అయితే ఇటీవల ఓటర్ల జాబితా సవరణలో భాగంగా రఫీఖుద్దీన్ పేరుతో ఆన్లైన్లో ఫారం-7 దాఖలైంది.
ఆ దరఖాస్తులో బిల్కిస్ సుల్తానా మరణించారని పేర్కొంటూ ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఆమె ఓటు తొలగిపోయింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న బిల్కిస్ సుల్తానా అధికారులను సంప్రదించాల్సి వచ్చింది. తిరిగి ఓటు హక్కు పొందేందుకు ఆమె ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు
ముషీరాబాద్‌లో ఇలాంటి వ్యవహారం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) 31 మంది ఓటర్ల పేర్లు తొలగించేందుకు నకిలీ ఫారం-7లను సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. అనంతరం బాలచందర్ అనే వ్యక్తిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పలు నియోజకవర్గాల్లోనూ ఫిర్యాదులు
ముషీరాబాద్‌తో పాటు గోషామహల్, బహదూర్‌పుర, అంబర్‌పేట, కార్వాన్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లోనూ అనుమానాస్పద ఫారం-7 దరఖాస్తులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
కొన్ని ప్రాంతాల్లో బీఎల్వోలపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు వారిని బెదిరించి దరఖాస్తులను ఆమోదింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా అధికారుల దృష్టికి వెళ్లాయి. దీంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.
ఆన్లైన్ దరఖాస్తులపై ప్రత్యేక పరిశీలన
ఫారం-7 దరఖాస్తుల విషయంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పలు సూచనలు జారీ చేశారు. మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపునకు కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన సందర్భాల్లోనే మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.
అదేవిధంగా ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి ముషీరాబాద్‌లో పర్యటించిన సమయంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. మరణ ధ్రువీకరణ పత్రం లేకుండానే ఫారం-7ను స్వీకరించిన బీఎల్వోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇక 24 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరుతో అతని భార్య ఓటును తొలగించేందుకు దరఖాస్తు చేసిన ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ తరహా అనుమానాస్పద దరఖాస్తుల వెనుక ఎవరు ఉన్నారు? అవి ఎలా ఆమోదం పొందాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
also read: రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాపై ఐటీ దాడులు.. ప్రైమ్ ఫోకస్ షేర్లకు భారీ దెబ్బ