
-
రిజర్వేషన్లు ఖరారు కాకుండానే మేయర్ అభ్యర్థి ప్రకటన
-
ఏకపక్షంగా ప్రకటించారంటూ మిగతా ఆశావహుల ఆవేదన
-
అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చ ప్రారంభం అయింది. ఏకపక్షంగా నెల్లూరు వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా విజయ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించారు జగన్. అసలు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. కనీసం ఏ స్థానానికి ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయకముందే.. అభ్యర్థిని ప్రకటించడం ఏంటనే ప్రశ్న సొంత పార్టీలోనే వినిపిస్తోంది.
కనీస నిబంధనలు, ఎన్నికల ప్రక్రియపై ప్రాథమిక అవగాహన కూడా లేని నేతగా జగన్ పై సొంత క్యాడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నెల్లూరు మేయర్ అభ్యర్థి విషయంలో తాడేపల్లి ప్యాలెస్ లో కోటరీ పైన ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి.
-
తారాస్థాయిలో విభేదాలు..
నెల్లూరు జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే నాయకుల మధ్య సమన్వయం లేదు. ఇప్పుడు ఏకపక్షంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించడం పై పెద్ద ఎత్తున గొడవ ప్రారంభం అయింది. నెల్లూరు నగరంలో పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.
స్థానిక నేతలతో సమగ్రమైన సంప్రదింపులు జరపకుండా.. గ్రౌండ్ రియాలిటీ ని పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం తాడేపల్లిలోని కొందరు ముఖ్యల ఒత్తిడి మేరకే ఈ ప్రకటన చేశారన్న భావన స్థానిక నాయకుల్లో బలంగా పాతుకు పోయింది. దీంతో జిల్లాలో పార్టీ ఐక్యతకు గండిపడటమే కాకుండా.. రానున్న ఎన్నికల్లో వర్గ పోరు ప్రభావం ఫలితాలపై పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి.
-
ఆ ఒక్క స్థానం ప్రకటనపై..
రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్ల వరకు ఉన్నాయి. ఇంకా వాటికి రిజర్వేషన్లు ఖరారు కాలేదు. అటువంటిది నెల్లూరు సీట్ పై ఇప్పుడు హఠాత్తుగా పేరు ప్రకటన ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఒకవేళ నెల్లూరు మేయర్ పదవి బీసీలకు కానీ.. ఎస్సీలకు కానీ రిజర్వ్ అయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నా వినిపిస్తోంది.
కేవలం తాడేపల్లి ప్యాలెస్ లో కొంతమంది నేతల తీరు వల్లే ఈ పరిస్థితి అని సొంత పార్టీ క్యాడర్ విమర్శిస్తోంది. ఒక్క నెల్లూరుకు ఇప్పుడు అభ్యర్థి ప్రకటించడంతో మిగతా నగరాల్లో ఆశావహులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
పార్టీ అంతర్గత సమావేశాల్లో అధినేత జగన్ సైతం కోటరీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయకుండా.. అనాలోచితంగా సలహాలు ఇస్తూ.. ఒక సమస్యను పరిష్కరించబోయి.. 100 సమస్యలను సృష్టిస్తున్నారంటూ కొందరు ముఖ్య నేతలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికైతే నెల్లూరు మేయర్ అభ్యర్థి ప్రకటన.. వైసీపీలో కొత్త ప్రకంపనలు రేపుతోంది..