అంతర్జాతీయం

పాక్‌ లో భారీ వర్షాలు, 200 మందికి పైగా మృతి

Pakistan Flash Floods: పాకిస్థాన్‌ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి.  భారీ వర్షాలకు దాయాది దేశంలో 214 మందికి పైగా చనిపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. వరదల్లో అనేక మంది గల్లంతు కావడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కుండపోత వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు రావడంతో కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి.

24 గంటల్లో 125 మంది మృతి

పాక్‌ లో ఖైబర్‌ పాఖ్‌ తున్‌ ఖ్వా ప్రావిన్స్‌ లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక మంది బలయిపోయారు. 24 గంటల్లోనే 125 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను కాపాడేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పాక్ ఆధీనంలోని గిల్గిట్ బాల్టిస్థాన్‌ కూడా భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. గిజర్ జిల్లాలో ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి 8 మంది మరణించగా, మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది. ప్రధాన రవాణా మార్గాలైన కరకోరం హైవే, బాల్టిస్థాన్ హైవే మార్గాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

ఇప్పటి వరకు 325 మంది మృతి

జూన్ నెల చివరి నుంచి పలుమార్లు కురిసిన కుండ పోత వర్షాల కారణంగా పాక్‌లో ఇప్పటివరకూ 325 మంది కన్నుమూశారు. వీరిలో 124 మంది చిన్నారులు కూడా ఉన్నారని పాక్ అధికారులు తెలిపారు. ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం కూడా భారీగానే సంభవించింది. పలు స్కూల్లు, చిన్న చిన్న ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక వసతులు నీట మునిగాయి. ప్రస్తుత వరదల నేపథ్యంలో క్షతగాత్రులకు కాపాడేందుకు పాక్‌ లో పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విపత్తు నిర్వహణ దళాలతో పాటు పాక్ ఆర్మీ, వాలంటీర్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అక్కడి అధికారులు ప్రజలకు సూచించారు.

Read Also: కాశ్మీర్ లో జల ప్రళయం, 60కి చేరిన మృతుల సంఖ్య!

Back to top button