
పచ్చని పొలాలు ఏడాదికి మూడు పంటలు పండే భూములు కాంక్రీట్ జంగిల్‌గా మారబోతున్నాయి. రాజధాని అమరావతి కోసమంటూ ఇప్పటికే మూడు పంటలు పండే 34వేల ఎకరాలు సేకరించింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు మరో 44వేల ఎకరాల సేకరణకు సిద్ధమైంది. రాజధాని అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ భూసేకరణతో లబ్ది జరుగుతుందా? లక్ష ఎకరాల రాజధాని ఎవరి మేలు కోసం.?
వ్యవసాయం రోజురోజుకూ తగ్గిపోతోంది. పంటలు సరిగా పండక సరైన ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. వ్యవసాయం మానేసి రియల్ ఎస్టేట్‌కు భూములు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు పంటలు పండే సారవంతమైన భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ… అలాంటి పచ్చని పొలాలను రాజధాని పేరుతో ప్రభుత్వమే సేకరించడం ఏంటి.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోని అవసరమైన మేరకే భూములు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు. 34 వేల ఎకరాలే ఎందుకు సేకరించారని ప్రశ్నిస్తుంటే మరో 44వేల ఎకరాల సేకరణకు సిద్ధమవడం మరీ విడ్డూరంగా ఉంది.
2014-2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అప్పుడు.. 34 వేల 568 ఎకరాలను సేకరించింది. ప్రభుత్వ భూమితో కలిసి రాజధాని కోసం 53వేల ఎకరాలను సమీకరించుకుంది. అన్ని ఎకరాలు ఎందుకని అప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో పాటు చాలా మంది ప్రశ్నించారు. పర్యావరణ వేత్తలు కూడా భూముల సేకరణను వ్యతిరేకించారు. మా భూములు ఇవ్వడం కుదరదంటూ కొంత మంది రైతులు ఎదురుతిరిగారు కూడా. కానీ ఏమైందో ఏమో రైతులే ముందు కొచ్చి భూములు ఇచ్చారని గొప్పగా చెప్పుకుంది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఆ భూముల్లో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు అంటూ కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం…. మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో… అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి.
Also Read : వైసీపీని వీడుతున్న బొత్స..? – కూటమిలో చేరేందుకు సన్నాహాలు..!
2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. మళ్లీ అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. రాజధాని పనులను వేగవంతం చేశారు. బాగానే ఉంది. మెచ్చుకోదగ్గ విషయమే. రాజధానే లేని రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మిస్తుంటే. అందరికీ సమ్మతమే. అయితే. రాజధాని పేరుతో మరోసారి భూసమీకరణకు పూనుకుంది చంద్రబాబు ప్రభుత్వం. మరో 44 వేల 676 ఎకరాలను రైతుల నుంచి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల నుంచి 44 వేల 676 ఎకరాలను సేకరించబోతోంది. ఇదే చాలా మందికి మింగుడుపడటంలేదు.
లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కొందరు. ఇదో ప్రపంచ రికార్డ్ అని.. అమరావతికి మహర్దశ అని సంబరపడుతున్నారు. ఒక రాజధానికి లక్ష ఎకరాలు అవసరమా.? అన్నది ఆలోచించడంలేదు. హైదరాబాద్ మహానగరంగా మారేందుకు శివారులు దాటి అభివృద్ధి చెందేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. హైదరాబాదే కాదు ఏ రాష్ట్ర రాజధానిని చూసుకున్నా అంతే. రాజధాని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ విస్తరించాలి. అంతేగానీ రాజధాని నిర్మాణమే లక్ష ఎకరాల్లో అంటే ఎలా..? అది మంచికా చెడుకా అన్నది ప్రభుత్వాలే ఒక్కసారి ఆలోచన చేయాలి.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..