
Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా మారిన వీధికుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన విచారణ జరిపిన న్యాయస్థానం ఢిల్లీ పరిధిలో ఒక్క కుక్క కూడా వీధుల్లో కనిపించడానికి వీల్లేదని వెల్లడించింది. వాటన్నింటినీ 8 వారాల్లో షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. ఈ తరలింపు ప్రక్రియకు అడ్డుపడే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో మినహాయింపులకు తావు లేదని తేల్చిచెప్పింది. కుక్క కాటు ఘటనలు, రేబిస్ కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని, జంతు ప్రేమికులు పిటిషన్లను పట్టించుకోబోమని బెంచ్ స్పష్టం చేసింది.
ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం
కుక్కల తరలింపు ఈ పనులను పౌర సంస్థలు చేయగలిగితే సరేనని.. లేదంటే ప్రత్యేక బృందాలను నియమిస్తామని బెంచ్ వెల్లడించింది. అటు కోర్టు నిర్ణయాన్ని తప్పక పాటిస్తామని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ కేసుపై స్పందించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సుప్రీం తీర్పునకు అనుగుణంగా విధానాన్ని రూపొందించి, ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తామని చెప్పారు.
జంతు ప్రేమికుల ఆగ్రహం
అటు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ రాజధానిలో 49 రేబిస్ కేసులు, 35,198 కుక్క కాటుకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. అలాగే, దేశవ్యాప్తంగా ఏటా 6 వేల మంది కుక్క కాటు, రేబిస్ కారణంగా మరణిస్తున్నారు. సుప్రీం కోర్టు తాజా తీర్పును ఢిల్లీలోని పలు కాలనీ సంఘాలు స్వాగతించాయి. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలపై జంతు ప్రేమికురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కల షెల్టర్లకు అవసరమయ్యే నిధులు, స్థలాలు పురపాలక సంఘాల వద్ద ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఢిల్లీలోని కుక్కల పునరావాసానికి రూ.15వేల కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున కుక్కలను తరలించడం అనేది వ్యర్థ ప్రయాస అని ‘పెటా’ అభిప్రాయపడింది. వీధి కుక్కలను జైల్లో పెట్టి సాధించేది కూడా ఏమీ ఉండదన్నది.