
ప్రస్తుత రోజుల్లో దారిలో డబ్బులు కనిపిస్తే వాటిని సొంతం చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. అయితే రాజస్థాన్లోని అజ్మేర్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఆయనకు విలువైన విదేశీ కరెన్సీ, కీలక పత్రాలు ఉన్న బ్యాగు కనిపించగా.. వాటిని తన వద్ద ఉంచుకోకుండా పోలీసులకు అప్పగించి తన మంచి మనసును చాటుకున్నారు.
అజ్మేర్కు చెందిన రాజేశ్ కుమార్ ఉదయం నడకకు వెళ్లిన సమయంలో మార్గమధ్యలో ఓ బ్యాగు కనిపించింది. దాన్ని తెరిచి చూడగా సుమారు రూ.9.48 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. అంత విలువైన వస్తువులు కనిపించినప్పటికీ ఆయన ఏమాత్రం ఆశపడలేదు. వాటిని అసలు యజమానికి చేర్చాలనే ఉద్దేశంతో వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగును అప్పగించారు.
బ్యాగులో లభించిన పత్రాలను పరిశీలించిన పోలీసులు.. అది ఎస్బీఐ మేనేజర్ సద్దాం ఆలంకు చెందినదిగా గుర్తించారు. అనంతరం సంబంధిత వివరాలను ధ్రువీకరించి, బ్యాగును సురక్షితంగా ఆయనకు అందజేశారు. విలువైన విదేశీ కరెన్సీతో పాటు కీలక పత్రాలు తిరిగి లభించడంతో యజమానికి ఊరట లభించింది.
మరోవైపు, రాజేశ్ కుమార్ చూపిన నిజాయితీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతరుల సొమ్ముపై ఆశపడకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించి బ్యాగును పోలీసులకు అప్పగించడం అభినందనీయమని కొనియాడుతున్నారు. డబ్బు కంటే నిజాయితీ, మానవత్వమే గొప్పవని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
also read: అన్నమయ్య జిల్లాలో దారుణం.. బీర్ బాటిల్తో దాడి చేసి భార్యను హతమార్చిన భర్త!