
క్రైమ్ మిర్రర్ : ఓ ప్రేమ వ్యవహారం కుటుంబాల మధ్య వివాదానికి దారితీసి, చివరకు ఓ తండ్రి ప్రాణాలను బలిగొంది. తన కుమారుడి ప్రేమ వ్యవహారంతో సంబంధం లేని తండ్రి దారుణ హత్యకు గురైన ఈ ఘటన పల్నాడు జిల్లాలోని మిరియాల ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కారంపూడి మండలం మిరియాలకు చెందిన దారెడ్డి రామకృష్ణారెడ్డి (51) గురజాలలో నివాసం ఉంటూ తన ఇద్దరు కుమారులతో కలిసి బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు లక్ష్మారెడ్డి గోగులపాడుకు చెందిన ఓ యువతితో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు.
ఈ క్రమంలో సోమవారం ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు గురజాలకు చేరుకుని రామకృష్ణారెడ్డి కుటుంబంతో గొడవకు దిగినట్లు సమాచారం. అనంతరం మాట్లాడుకుందామంటూ రామకృష్ణారెడ్డితో పాటు ఆయన పెద్ద కుమారుడు వెంకటరెడ్డిని బైక్‌పై తీసుకెళ్లి గోగులపాడు శివారులోని పొలాల వద్దకు చేరుకున్నారు. అక్కడ వారిపై కర్రలు, కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడి నుంచి తప్పించుకున్న వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే రామకృష్ణారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కుమారుడి ప్రేమ వ్యవహారం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో తండ్రి మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
also read : మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతురాజు పాత్రలో పవర్ఫుల్ అవతార్!