
– ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల నోటిఫికేషన్
– గ్రామాలు, పట్టణాల్లో రచ్చ ప్రారంభం
– ఆశల పల్లకిలో ఆశావహులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఏ క్షణంలోనైనా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు దసరా సందడి నెలకొనగా.. మరోవైపు ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. పల్లెలతో పాటు పట్టణాల్లో ఏ వార్డు ఎవరికి దక్కుతుంది అనే చర్చలే ఇప్పుడు ప్రధానోజెండాగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల గెజిట్ చేరింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మరింత వేగవంతం చేసింది. ఈనెల 13న అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనుంది. అక్టోబర్ 14 లేదా 15న అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30 నాటికి మూడు దశల్లో పంచాయితీ, మండల, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని ముగించాలని ఎన్నికల సంఘం పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో అసలైన దసరా కంటే ముందుగానే ఎన్నికల దసరా మొదలుకానుంది.
రిజర్వేషన్ల అంశం కొలిక్కి..
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాత మరింత వేగవంతం అయ్యింది. ప్రభుత్వం కేటాయించిన అధికారిక రిజర్వేషన్ల తుది జాబితా పై ఏ క్షణమైనా ప్రకటన రానుండడంతో ఆశావహుల్లో గుబులు మొదలైంది. ఏ స్థానం జనరల్ అవుతుంది? ఎక్కడ మహిళా కోటా పడుతుంది? బీసీలకు కేటాయించిన సీట్లలో ఎవరికి టికెట్ దక్కుతుంది? అనే అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీలతో సంబంధం లేకుండా టిక్కెట్లను ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు అధిష్టానాల చుట్టూ, స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పండుగ పూట ఇళ్లల్లో ఉండాల్సిన నేతలంతా రిజర్వేషన్ల రోస్టర్ చూసుకుంటూ సామాజిక సమీకరణలను లెక్క కడుతున్నారు.
ఎత్తుకు పైఎత్తులు..
మరోవైపు ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి గట్టి ప్రయత్నాల్లో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి.. అదే పట్టును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభవానికి గురైన వైసిపి ఈ ఎన్నికలతో ఉనికి చాటుకోవాలని చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు తావు లేదని జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిలను హెచ్చరించారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ కు టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అనేది అనివార్యంగా మారనుంది. గ్రామాలతో పాటు పట్టణాల్లో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.