తెలంగాణ

పిల్లలకు తిండి పెట్టలేని గాలిమాటలోడు.. రేవంత్ పై రెచ్చిపోయిన కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏడాది పూర్తైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీల మీద మాట్లాడితే.. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి దాడి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే రేవంత్ వ్యవహరిస్తున్నారని అన్నారు. మూసీ మీద ఆందోళన చేస్తే.. వ్యక్తిగతంగా మాట్లాడతారు తప్ప సమాధానం ఇవ్వరు.. ఏడాదికాలంలో మీరేం పనిచేశారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

7న ప్రమాణ స్వీకారం చేస్తాం.. 9న సోనియా జన్మదినం సందర్భంగా.. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఏమైంది?డిసెంబర్ 9న పింఛన్లు పెంచుతామన్నారు? ఏమైంది? వందరోజుల్లో 6 గ్యారెంటీలు. ఏడాదిలో 420కి పైగా సబ్ గ్యారెంటీలు పూర్తిచేస్తామని చెప్పారు.. ఏమైందని కిషన్ రెడ్డి నిలదీశారు. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగ యువత.. విద్యారంగం ఇవాళ అన్ని రంగాల్లో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి..
ఇవేవీ సాధించలేదు.. కానీ వారంరోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ఏడాదిలో ఏం సాధించారు.. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప.. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించిందేమీ లేదు.. నేను సమస్య గురించి మాట్లాడితే.. కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటి అని అడుగుతున్నారు. నా డీఎన్ఏ బీజేపీ డీఎన్ఏ..మీలాగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదు అంటూ ఘాటుగా కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. బీజేపీ పార్టీ తరపున.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలమీద.. డిసెంబర్ 1 నుంచి 5 వరకు.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం.. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని.. సోనియా గాంధీ పేరుతో లేఖలు పంపడం.. నిజం కాదా? అని ప్రశ్నించారు.

నిరుద్యోగులు రాహుల్, రేవంత్ చెప్పిన మాటలను విని మోసమోయారని కిషన్ రెడ్డి అన్నారు. జాబ్ క్యాలెండర్లు విడుదలతో యువతను మోసం చేశారు.. రైతులకు రైతు భరోసా.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బుల సంగతేంది?మహిళలకు రూ.2,500 ఇస్తామన్న సంగతేమైంది? నిరుద్యోగ భృతి, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు? ఎందరికి అందింది? సుమారు 13 పంటలకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. కనీసం వరికి కూడా ఇవ్వకుండా.. సన్నబియ్యం, దొడ్డు బియ్యం అని కొత్త రూల్స్ జోడించడం దారుణం.ధాన్యం కొనుగోలును.. కేంద్రం డబ్బులిచ్చి కొంటుంటే.. కొనుగోలు కేంద్రాల నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదు.మహిళలకు సంబంధించి.. తులం బంగారం, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛన్.. ఒక్క రూపాయి కూడా పెరగలేదు.. ఉన్నది సరిగ్గా ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button