
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు మరో కీలక అవకాశం త్వరలో ముగియనుంది. కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగియడానికి కేవలం ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. మొత్తం 25,487 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, డిసెంబర్ 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ నియామకాలకు కనీస విద్యార్హతగా పదో తరగతి ఉత్తీర్ణతను నిర్ణయించారు. వయోపరిమితి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. వయో సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయని అధికారులు తెలిపారు. తక్కువ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశంగా అభ్యర్థులు భావిస్తున్నారు.
మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు 1,105 ఉద్యోగాలను కేటాయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువతలో ఆసక్తి మరింత పెరిగింది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహించనున్నారు. మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ప్రతిభను పరీక్షిస్తారు. ఆ తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు, శారీరక కొలతల పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపడతారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తారు. అభ్యర్థులు ఇప్పటి నుంచే సిలబస్‌కు అనుగుణంగా సిద్ధమవాలని సూచిస్తున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగానే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర బలగాల్లో ఉద్యోగం సాధించాలని కలలు కనే యువతకు ఇది మంచి అవకాశంగా నిలుస్తోంది.
ALSO READ: (VIDEO): ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్ ఇదేనట!.. ధర రూ.88 కోట్లు





