దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. జమిలి ఎన్నికలపై చాలా రోజులుగా కసరత్తు చేస్తున్న మోడీ సర్కార్.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును తీసుకురానుందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టడంతో.. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి ఇదే అనువైన సమయమని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనెల 26న పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. సభా వ్యవహారాల సంఘం లో నిర్ణయించిన అంశాల ఆధారంగా మిగిలిన రోజుల్లో సభలు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల్లో 17 బిల్లులు చర్చకు రానున్నాయి. మహారాష్ట్రలో గెలుపుతో అధికార పక్షం ఊపుమీద ఉంది. దీంతో కొంతకాలంగా చర్చలో ఉన్న జమిలి ఎన్నికల బిల్లును కేంద్రం తీసుకురానుందని చెబుతున్నారు. మోడీ సర్కార్ అంతా అనుకున్నట్లు జరిగితే 2027 చివరలో దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని తెలుస్తోంది.
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక ఈ సమావేశాలు ప్రారంభమైన తొలివారంలో సభ ముందుకు వస్తుందా? రాదా? అనేది తేలాల్సి ఉంది. నిర్దేశించిన గడువు ప్రకారం ఈ నివేదిక శుక్రవారంలోపు సభ ముందుంచాలి. అదానీ అంశంలో పట్టు బిగించాలని విపక్షం పట్టుదలతో ఉంది. దీనిపై సమావేశాల్లో చర్చించాలని తాము అఖిలపక్షంలో డిమాండు చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్ వెల్లడించారు. ఈ కుంభకోణం అమెరికాలో బయటపడినందున దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా మణిపుర్ హింసపైనా సమాధానమివ్వాలని సూచించారు.