
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-
టమాటా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ఆరుగాలం శ్రమించి..పంట పండిస్తే చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అల్లాడిపోతున్నారు.కిలో కేవంల 10 రూపాయలే పలకడంతో కర్షకులు కష్టాల్లో పడ్డారు. కూలీలు, రవాణా ఖర్చు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో టమోటాలను పొలంలోనే వదిలి వెళ్తున్నారు రైతులు.ధరలు పడిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని టమోటా రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటిపర్యంతమయ్యారు.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి:-
టమాట పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది.పండించిన పంటకు గిట్టుబాటు రాక రైతులు దిగాలు పడుతున్నారు. దిగుబడి పెరిగి కష్టాలు తీరుతాయని ఆశించిన వారు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు.ఇప్పటివరకు మంచి ధరలతో రైతులకు ఉపశమనం కలిగించిన టమాట ఇప్పుడు పతనమై వారి జీవితాల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.పది రోజుల కింద రూ.30 ఉన్న కిలో టమాట ఒక్కసారిగా పడిపోయింది.కిలో టమాట రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్థాయిలో టమాట ధరలు ఎప్పుడూ పడిపోలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పంట మార్కెట్‌కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.
దిగుబడి ఘనం..ధరలు పతనం…!
ప్రైవేట్ మార్కెట్లలో, రైతు బజార్లలో కిలో టమోటా ధర రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతోంది. కష్టపడి పండించిన రైతుకు మాత్రం కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు చెల్లిస్తున్నారు.సాగు చేసిన టమోటా దిగుబడి బాగా వచ్చినప్పటికీ చేతికొచ్చే సమయానికి ధరలు తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.రెండు నెలల కిందట బాక్స్ (25 కిలోలు) రూ.700 ఉన్న ధర ప్రస్తుతం రూ.150 నుండి 200 లకు పడిపోయింది.జనవరి చివరి వారం నుంచి టమోటా దిగుబడి అధికంగా వస్తోంది.టమోటా ఎకరా సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు రూ. 70 వేల వరకు రైతులు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ. 8 నుంచి రూ.10 వరకు అమ్మకాలు చేపడుతున్నారు.ఈ ప్రకారం రైతులకు బాక్స్ రూ.500 వరకు రావాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.దళారులు సూచించిన ధరలకు రైతులు టమోటాను అమ్ముకోవాల్సి వస్తుంది.
జిల్లా 1865 ఎకరాల్లో సాగు…?
జిల్లావ్యాప్తంగా ఏటా 20వేల ఎకరాలకు పైగా కూరగాయల పంటలు పండిస్తున్నారు.ఇతర పంటలతో నష్టపోకుండా ఉండేందుకు వేలాది మంది రైతులు సాగు చేస్తున్నారు.పూడూర్,వికారాబాద్,తాండూర్,బషీరాబాద్,కొడంగల్,మర్పల్లి,నవాబుపేట్,మోమిన్ పేయ్ ధారూర్,పరిగి,తదితర మండలాల్లో వానకాలంలో సుమారు 1865 ఎకరాల్లో 2312 మంది రైతులు సాగు చేశారు.పిబ్రవరి నెల మొదటి వారం నుండి టమాటా పంట చేతికందుతోంది.సరిగ్గా ఇదే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు లబోదిబోమ్మంటున్నారు.
శీతల గిడ్డంగులు ఒక్కటి లేవు..!
జిల్లాలో ప్రభుత్వ పరంగా శీతల గిడ్డంగులు ఒకటి లేవు.ధరలు పడిపోతున్న సమయంలో తాత్కాలిక రుసుం చెల్లించి నిల్వ చేసుకొని తిరిగి అమ్ముకునేందుకు అవసరమైన వసతి అందుబాటులో లేకపోవడం కూడా నష్టాలకు కారణమవుతుంది. ప్రభుత్వ ప్రవేట్ భాగ్యస్వామ్యంతో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోకుండా ఉండడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెట్టిన పెట్టుబడి రాక అప్పులే మిగిలాయి…!హనుమంత్ రెడ్డి,టమాటా రైతు -నవాబ్ పేట్
లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఎకరం పొలంలో టమాట పంట సాగు చేశాను.పంట దిగుబడి బాగానే ఉంది.కానీ ధర మాత్రం లేదు.25 కిలోల టమాట బాక్స్ రూ.150 నుంచి రూ.200అమ్ముతుంది.ఈ ధరకు టమాటాలు తెంపితే.. కనీసం కూలీల ఖర్చులు కూడా మిగడం లేదు.ప్రభుత్వ టమాట రైతులను ఆదుకోవాలి కోరుతున్నానన్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూరగాయలు నిర్వహించేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.