
ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించింది భారత్. పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రదాడి చేస్తే.. యుద్ధంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. బాంబు పేలుళ్లు, కాల్పులు, హైజాక్స్.. ఎలాంటి దాడికి పాల్పడిగా.. ధీటుగా బదులిస్తామని హెచ్చరించింది. కాల్పుల విరమణకు ముందు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఆ ప్రకటనకు ముందు.. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. త్రివిధ దళాధిపతులతో సమావేశమైన ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టెర్రర్ అటాక్స్‌ను.. యుద్ధ చర్యగానే పరిగణిస్తామని తేల్చిచెప్పింది ఇండియా. ఇకపై ఎలాంటి ఉగ్రదాడులు జరిగినా సహించేది లేదని.. యుద్ధానికి ఉసిగొల్పినట్టే భావిస్తామని స్పష్టం చేసింది. ఉగ్రదాడులకు ధీటుగా ప్రతిస్పందించాలని నిర్ణయించింది.
పెహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా… ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. పాకిస్థాన్ గడ్డపై ఉన్న, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను టర్గెట్ చేసింది. ఆ తర్వాత.. పాకిస్తాన్ వరుస కాల్పులకు తెగబడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు విఫలయత్నం చేసింది. పాకిస్తాన్ దాడిని భారత రక్షణ దళం… సమర్థంగా తిప్పికొట్టింది. రెచ్చగొట్టే ధోరణితో వ్యవరిస్తున్న పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. అక్కడి వైమానిక వ్యవస్థ, స్థావరాలపై ప్రతిదాడులు చేసింది. అయినా.. పాకిస్థాన్ రెచ్చగొట్టే తీరును వదులుకోలేదు. వరుసగా మూడు రోజుల పాటు భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలప డ్రోన్లు, క్షిపణి దాడులు చేసింది. అందుకు ధీటుగా మరిన్ని కౌంటర్ ఎటాక్స్ చేశాయి మన బలగాలు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద గ్రూపులకు లాజిస్టికల్ మద్దతు ఇస్తోంది. ట్రైనింగ్, ఫండింగ్ కూడా అందిస్తోందని భారత సైనిక, నిఘా వర్గాలు ఆధారాలతో చూపించాయి. పాకిస్థాన్‌లోని కొన్ని ఉగ్రవాద శిబిరాలు.. సైనిక స్థావరాలు, కంటోన్మెంట్‌లకు దగ్గరగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అండ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఓవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై మాత్రం బాధ్యత గల దేశంగా నటిస్తూ వస్తోంది పాకిస్తాన్. హింసాత్మక శక్తులను రహస్యంగా పెంచి పోషిస్తోంది. దాయాది దేశం వక్రబుద్ధి, కుట్రల గురించి తెలిసిన భారత్.. పాకిస్థానీ ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సీజ్ ఫైర్‌కు ఒప్పుకుంటూనే… ఉగ్రచర్యలకు పాల్పడితే మాత్రం యుద్ధమే అంటూ హెచ్చరించింది.