ఆంధ్ర ప్రదేశ్

జనసేనలో చీలిక - పవన్‌, నాదెండ్ల మధ్య గొడవలు..!

జనసేనలో చీలిక రాబోతోందా…? పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మధ్య సయోధ్య చెడిందా..? ప్రస్తుతం.. వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారా…? విభేదాలు బయటకు పొక్కకుండా… అంతా నార్మల్‌గా ఉన్నట్టు నటిస్తున్నారా..? అసలు జనసేనలో ఏం జరుగుతోంది. పవన్‌, నాదెండ్ల మధ్య విభేదాలు రావడం ఏంటి…? ఇందులో ఎంత నిజముంది..?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన కళ్యాణ్‌ అయితే… పార్టీలో నెంబర్‌-2 స్థానం నాదెండ్ల మనోహర్‌ది. పవన్‌ కళ్యాణ్‌కు నమ్మకస్తుడిగా ఉంటూ… జనసేనను ముందుండి నడిపించారు నాదెండ్ల మనోహర్‌. జనసేన అంటే పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ అన్నట్టు ఉండేది. కానీ… ఇప్పుడు ఏమైంది..? పవన్‌ కళ్యాణ్‌, నాదెండ్ల మధ్య విభేదాలంటూ వార్తలు ఎందుకు వస్తున్నాయి. నిప్పు లేకుండా పొగ రాదంటారు. అంటే ఇందులో ఎంతోకొంత నిజం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అసలు పవన్‌ కళ్యాణ్‌కు, నాదెండ్లకు ఎక్కడ చెడింది..?

జనసేనలో పవన్‌ కళ్యాణ్‌కు నీడలా ఉండేవారు నాదెండ్ల మనోహర్‌. రాజకీయంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకునేవారు. పవన్‌ కళ్యాణ్‌ ఆర్ధిక వ్యవహారాలు కూడా నాదెండ్లకు తెలిసే జరిగేవని సమాచారం. అంత దగ్గరగా ఉన్న వీరిద్దరి మధ్య దూరమా…? నమ్మడం కష్టమే.. కానీ.. ఏదైనా జరగొచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కదా…! జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నెమ్మదిగా వారి మధ్య దూరం పెరుగుతోంది… విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది వరకు నాదెండ్లకు చెప్పకుండా ఏ పని చేయని పవన్‌… ఇప్పుడు ఆర్థిక వ్యవహరాలన్నీ సొంతంగా చక్కబెట్టుకుంటున్నారట. అంతేకాదు.. సొంత సామాజికవర్గం నేతలకే ప్రాధాన్యత ఇచ్చి జనసేనను కులపార్టీగా మారుస్తున్నారని నాదెండ్ల భావిస్తున్నారు. పైగా… కొన్ని విషయాల్లో పవన్‌ కళ్యాణ్‌ సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా నాదెండ్లకు మింగుడు పడటం లేదని అంటున్నారు. నాగబాబు విషయంలో కూడా నాదెండ్ల అసంతృప్తిగానే ఉన్నారట. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం… మంత్రి పదవి కూడా ఇస్తామనడం… నాదెండ్లకు నచ్చడం లేదట. అన్నీ కలిసి… పవన్‌, నాదెండ్ల మధ్య దూరం పెరుగుతోందని సమాచారం.

ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నా… అవి రోజురోజుకూ పెరుగుతున్నా… పైకి మాత్రం… అంతా బాగేనే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే… కూటమిలో అధికారం పంచుకుంటున్న పార్టీ కనుక. విభేదాలు బయటపడితే పార్టీ పరువు పోతుంది కనుక. అయితే… పవన్‌ కళ్యాణ్‌ తీరు ఇలాగే ఉంటే.. నాదెండ్ల మాత్రం తాడో పేడో తేల్చుకుంటారని ఆయన వర్గం అంటోంది. సో… జనసేనలో త్వరలో బాంబు పేలడం మాత్రం ఖాయమనే అనుకోవాలి.

Back to top button