Telangana

కోమటిరెడ్డి బ్రదర్స్ కూల్ కాలేదా.. అద్దంకి పదవి రానట్టేనా?

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాధినేతగానే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కూడా. హైకమాండ్ దగ్గరా ఆయన తిరుగు లేకుండా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని అన్నింటా ఆయన మార్క్ కనిపిస్తుంది. పవుర్ ఫుల్ గా లీడర్ గా కనిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. తన సహచరుడు అద్దంకి దయాకర్ విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు.అద్దంకి విషయంలో సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాటే చెల్లడం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దురదృష్టవంతుడిగా అద్దంకి దయాకర్‌ ముద్ర పడ్డారు. కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయనుకున్నప్పుడు ఆయనకు టిక్కెట్ దొరకలేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదిగో ఎమ్మెల్సీ అన్నారు. అదీ రాలేదు. చివరి క్షణంలో పేరు మారిపోయింది. తర్వాత వరంగల్ ఎంపీ టిక్కెట్ అన్నారు. అదీ దక్కలేదు. కంటోన్మెంట్ ఉపఎన్నికలో అయినా సీటు వస్తుందనుకుంటే.. బీజేపీ నేతను చేర్చుకున్నారు.

అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1,847 ఓట్లతో, రెండవసారి 2,379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే అసలు టిక్కెట్టే దక్కలేదు. అద్దంకి దయాకర్‌కు రేవంత్ రెడ్డి మద్దతు ఉన్నా.. ఆయనకు అవకాశాలు రావడం లేదు.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సందర్భంగా రేవంత్‌రెడ్డి మునుగోడులో సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. పైగా పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేశారు. ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ … కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అని దూషించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి క్షమాపణలు చెప్పారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ హిట్ లిస్ట్‌లో మాత్రం అద్దంకి దయాకర్ చేరిపోయారు.

ఎమ్మెల్యే టికెట్ ఇప్పించలేకపోవడంతో అద్దంకికి క్షమాపణలు చెప్పినట్లు స్వయంగా రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ప్రయత్నించినప్పుడు.. సీనియర్లకు అవకాశం కల్పించాలంటూ పార్టీలో కొందరు అడ్డుపడినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. నల్లగొండ నేతలకు పదవి ఇవ్వాలంటే… కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న టాక్ పార్టీ నేతల్లో ఉంది. అద్దంకి విషయంలో కోమటి బ్రదర్స్ అనుగ్రహం లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ కూడా పదవి ఇవ్వలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.