
Malegaon Bomb Blast Case: మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ముంబై NIA కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది. 2018 సంచలనం కలిగించిన ఘోర బాంబు పేలుడు కేసుకు సంబంధించి సుమారు 17 ఏళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.
ఆరుగురు మృతి, 100 మందికి గాయాలు
మహారాష్ట్రలోని మాలేగావ్ లో జరిగిన ఈ పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో మాజీ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రమేష్ ఉపాధ్యాయ, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి నిందితులుగా ఉన్నారు. వీరంతా UAPA, IPC కింద పలు అభియోగాలను ఎదుర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి NIA కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లాహోటి తాజాగా వారందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. తీర్పు సందర్భంగా.. ప్రాసిక్యూషన్ అనేక కీలక అంశాలను నిరూపించడంలో విఫలమైందన్నారు. బాంబు మోటార్ సైకిల్ మీద ఉంచబడిందని నిర్ధారించే ఆధారాలు లేవని, బాంబు వేరే చోట ఉంచి ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది. “RDXను కాశ్మీర్ నుంచి తీసుకొచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. మోటార్ సైకిల్ ను ఎవరు పార్క్ చేశారు? అది అక్కడికి ఎలా వచ్చింది? అనే విషయంపై కూడా స్పష్టత లేదు. సాక్షుల వాంగ్మూలాలు అస్పష్టంగా, వైరుధ్యంగా ఉన్నాయి. కల్నల్ పురోహిత్ బాంబును తయారు చేశాడని, సాధ్వీ ప్రగ్యా బైక్ పేలుడులో ఉపయోగించబడిందని నిరూపించే ఆధారాలు లేవు” అని కోర్టు స్పష్టం చేసింది. ఫైనల్ గా ఏ మతం ఉగ్రవాదాన్ని సమర్థించదని న్యాయమూర్తి లాహోటి తెలిపారు.
Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!