
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత.. ఇప్పుడు ఆ పార్టీకి ప్రత్యర్థి అయ్యాడు. వైఎస్ జగన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు… ఇప్పుడు రాజకీయ వేడీ రాజేశాయి. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఏంటి…? అందులో ఎవరు ఉన్నారు..? వారంతా ఏం చేస్తున్నారు…? జగన్ను కలవాలంటే.. నిజంగా ఆ కోటరీ పర్మిషన్ ఉండాల్సిందేనా…? విజయసాయిరెడ్డి మాటలు వింటే అవును అనేలా ఉన్నాయి. వైసీపీ నేతలు మాత్రం అదేంలేదని కొట్టిపారేస్తారు. అసలు విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ రాజకీయం ఎందుకు మొదలైంది..?
విజయసాయిరెడ్డి… వైఎస్ జగన్కు సన్నిహితుడు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2 నిందితుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు వైఎస్ జగన్. పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు సాయిరెడ్డి. ఇంత బాండింగ్ ఉన్న జగన్, విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి…? దీనికి కారణం ఎవరు..? దీనిపై ఎన్నో ఊహాగాహాలు, కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ… విజయసాయిరెడ్డి ఓపెన్ అయ్యారు. కాకినాడ పోర్టు కేసులో సీఐడీ విచారణ ముగిశాక.. మీడియాతో మాట్లాడిన ఆయన… తన బాధ చెప్పుకున్నారు. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని… దాని వల్లే ఆయనకు తాను దూరమయ్యాయని అన్నారు. ఈ కోటరీని దూరం చేసుకోకపోతే.. వైసీపీకి భవిష్యత్ ఉండదని కూడా హెచ్చరించారు విజయసాయిరెడ్డి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీగా చేరారని అన్నారు. జగన్ను కలవాలంటే… ఆ కోటరీ పర్మిషన్ ఉండాలని.. అందుకు వారికి లాభం చేకూర్చాలని కూడా చెప్పుకొచ్చారు. కోటరీలోని ఆ నేతల చెప్పుడు మాటలు జగన్ వింటున్నారని.. దాని వల్ల ఆయనకే నష్టం జరుగుతోందని అన్నారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు వినకూడదని అన్నారు విజయసాయిరెడ్డి. జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసి.. మనసు విరిగిపోయిందని.. ఇక వైసీపీలో ఉండలేక బయటకు వచ్చేశానని ఆవేదన చెప్పుకున్నారాయన.
వైసీపీలో ఉన్న కొందరు నేతలు.. తనకు, జగన్కు మధ్య అభిప్రాయబేధాలు సృష్టించారని.. మా ఇద్దరినీ దూరం చేయడంలో విజయం సాధించారని చెప్పారు విజయసాయిరెడ్డి. మూడున్నరేళ్లు పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. అన్నింటినీ దిగమింగానని అన్నారాయన. తనను తొక్కుకుంటూ… కొందరు ఎదిగారని కూడా చెప్పారు. కోటరీ నుంచి జగన్ ఎప్పుడు బయటపడతారో.. అప్పుడే ఆయనకు భవిష్యత్ ఉంటుందని అన్నారు. తిరిగి రమ్మన్నా… ఆ పార్టీలోకి తాను వెళ్లనని అన్నారు విజయసాయిరెడ్డి.
అటు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ చుట్టూ కోటరీ అంటూ ఉంటే.. అది విజయసాయిరెడ్డే అని… ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారు కనుక… ఇక కోటరీ అంటూ ఏమీ ఉండదని కౌంటర్ ఇస్తున్నారు. పార్టీని వీడిన వాళ్లు బురదచల్లడం కామనే అని… దాన్ని పట్టించుకోవాల్సి అవసరం లేదంటున్నారు. జగన్ రెండు చెవుల్లో సలహాలు ఇచ్చేది కూడా విజయసాయిరెడ్డే అని అంటున్నారు. ఏదిఏమైనా.. జగన్ చుట్టూ కోటరీ ఉందన్నది.. చాలా మంది చెప్తున్న మాట.