
కొణిదల నాగబాబు.. మెగా బ్రదర్. ఏపీలో కూటమి తరపు నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ కూడా సమర్పించారు. అందులో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచారు. నాగబాబుకు 70 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. అలాగే అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి నుంచి 28 లక్షల 48వేల రూపాయలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్‌లో పెట్టారు నాగబాబు. అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి కూడా 6లక్షల 90వేలు అప్పుతీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరి నుంచే కాకుండా… ఇతరుల నుంచి కోటి 64 లక్షల వరకు అప్పులు ఉన్నాయట. అలాగే… రెండు బ్యాంకుల్లో 57 లక్షల ఇంటి లోను, 7.54 లక్షల కారు లోను ఉన్నట్టు తెలిపారు.
ఆస్తులు అయితే 70 కోట్ల వరకు ఉన్నాయని అఫిడవిట్‌లో పెట్టారు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55 కోట్ల 37 లక్షలు పెట్టుబడులు ఉన్నాయట. ఆయన చేతిలో 21లక్షల 81వేల రూపాయలు, బ్యాంకులో 23 లక్షల 53వేలు ఉన్నాయని చెప్పారు. వాహనాల సంగతి చూస్తే… ఆయనకు రెండు కాస్ట్‌లీ కార్లు ఉన్నాయి. 67లక్షల 28వేలు విలువచేసే బెంజ్‌కారు, 11లక్షల 4వేలు విలువైన హ్యుందయ్ కారు ఉన్నట్టు అఫిడవిట్‌లో చెప్పారు. తన దగ్గర, తన కుటుంబం దగ్గర ఉన్న బంగారం వివరాలు కూడా నమోదు చేశారు. తన దగ్గర 26 గ్రాముల బంగారం ఉందని… దాని విలువ 18 లక్షల 10వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక.. తన భార్య దగ్గర 16లక్షల 50వేల రూపాయలు విలువచేసే… 55 క్యారెట్ల వజ్రాలు, 57లక్షలు విలువచేసే 724గ్రాముల బంగారం, 21లక్షల 40వేల రూపాయలు విలువచేసే 20కేజీల వెండి ఉన్నట్టు చెప్పారు.
Read More : తెలుగు రాష్ట్రాలలో అడుగంటుతున్న నీరు… ఎండిపోతున్న పైరు?
స్థిర, చరాస్తుల విషయాలు కూడా వెల్లడించారు నాగబాబు. చరాస్తులు అయితే… తనకు, తన భార్యకు కలిపి 59 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిపారు. స్థిరాస్తులు చూస్తే… హైదరాబాద్ మణికొండలో 2.88 కోట్ల రూపాయలు విలువచేసే విల్లా ఉంది. దీని విలువ 11 కోట్లుగా ఉంది. అలాగే… రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల 2.39 ఎకరాల భూమి ఉందట. దాని విలువ 3 కోట్ల 55 లక్షలు ఉంటుంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రెండు చోట్ల 33 లక్షలు విలువచేసే 3.28 ఎకరాలు భూమి, అలాగే 50లక్షల రూపాయాలు విలువచేసే ఐదెకరాల భూమి ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో 53లక్షలు విలువ చేసే ఎకరంపైగా భూమి ఉంది. కేసుల విషయానికి వస్తే.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు మెగాబ్రదర్ నాగబాబు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి నుంచి తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈనెల 7న నామినేషన్ వేశారు నాగబాబు. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేయాల్సి ఉంది.